కర్నూలు, జనవరి 9, (way2newstv.com)
ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచినా అక్కడ పెత్తనం అగ్రవర్ణాలదే ఉంటుంది. ఇక్కడ ఏ పార్టీ అయినా ఒక్కటే. ఎమ్మెల్యేను డమ్మీలుగా చూస్తారు. అనధికారిక ఎమ్మెల్యేలుగా పెద్దలు పెత్తనం చలాయిస్తారు. పాపం దళిత ఎమ్మెల్యేలు కొందరు చూసీ చూడనట్లు వెళుతున్నా మరికొందరు మాత్రం తిరగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నా కోడుమూరు నియోజకవర్గంలో సేమ్ టు సేమ్. పార్టీ పెద్దలు కూడా వీరిని ఏం చేయలేకపోతున్నారు. ఈ పంచాయతీ నిత్యం కోడుమూరులో నలుగుతూనే ఉంటుంది కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన మణిగాంధీ తర్వాత అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయనకు అక్కడ టీడీపీ ఇన్ ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.
పేరుకే ఎమ్మెల్యే...
చివరకు మణిగాంధీకి పార్టీ సభ్యత్వ పుస్తకాలను కూడా ఇవ్వకుండా అవమానం చేశారు. దీంతో ఆయన ఎందుకు పార్టీ మారానా? అని ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎన్నికల వరకూ ఇద్దరి మధ్య విభేదాలు తొలగిపోలేదు. దీంతో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది.అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా డాక్టర్ సుధాకర్ గెలుపొందారు. సుధాకర్ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టిక్కెట్ పొందారు. అయితే అదే సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఎన్నికలకు ముందే వైసీపీలో చేరడంతో ఆయనను జగన్ కోడుమూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించారు. అయితే జగన్ హవాతోపాటు ఇద్దరు కలసి పనిచేయడంతో వైసీపీ కోడుమూరులో విజయం సాధించింది.ఇక తాజాగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ కు మధ్య పడటం లేదు. ఇద్దరూ పార్టీ కార్యక్రమాల్లో కలసి పాల్గొనడం లేదు. తన ప్రమేయం లేకుండా పనులు చేయవద్దని అధికారులకు ఎమ్మెల్యే సుధాకర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అధిష్టానం వద్దే తేల్చుకుంటానని సవాల్ విసిరారు. ఇటీవల సుధాకర్ టీడీపీ నేతలను కొందరికి వైసీపీ కండువా కప్పడాన్ని కూడా కోట్ల వ్యతిరేకించారు. ఒకవర్గం వారిని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారంటూ సుధాకర్ ఫ్లెక్సీలను కూడా కోట్ల వర్గం తగులబెట్టింది. గతంలో ఒకసారి వైసీపీ పెద్దలు కోడుమూరు పంచాయతీ చేసినా మళ్లీ మొదటికొచ్చింది. జగన్ నేరుగా జోక్యం చేసుకోకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భంగపాటు తప్పదంటున్నారు.