ఎమ్మెల్యేలకు. మున్సిపల్ పరీక్ష్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎమ్మెల్యేలకు. మున్సిపల్ పరీక్ష్

హైద్రాబాద్, జనవరి 2, (way2newstv.com)
ఖమ్మం సామాజికంగా చైతన్యవంతమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం. రాష్ట్రం యావత్తూ ఒక రకమైన ఫలితాలొస్తే ఇక్కడ మాత్రం పూర్తి విరుద్ధమైన ప్రజా తీర్పులుంటాయి. 2014, 2018 శాసనసభ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌, తనయుడు కేటీఆర్‌ ఎన్నికల సభల్లో పాల్గొన్నా ఓటర్లు వరుసగా షాక్‌ ఇచ్చారు. అప్పుడూ ఇప్పుడూ జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో ఒకేస్థానంతో టీఆర్‌ఎస్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. త్వరలో ఐదు స్థానాలకు జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గట్టెక్కుతుందా? లేదా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వారి చేతుల్లో ఓడినవారికి పొసగడం లేదని తెలుస్తుండగా.. నియోజకవర్గంలో రెండు మూడేసి గ్రూపులున్న భయం గులాబీ నేతలను వెంటాడుతున్నది.
 ఎమ్మెల్యేలకు. మున్సిపల్ పరీక్ష్

2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పదినియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లు 1,55,830 కాగా, 2018 ఎన్నికల్లో ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదినియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సాధించిన ఓట్లు 5,88,798. 2014 ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్‌కు 4,32,968 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇంత ఓటు బ్యాంకు పెరిగినా రెండుసార్లు ఒకటే సీటు దక్కింది. అప్పుడు కొత్తగూడెం కేంద్రంలో జలగం వెంకటరావు గెలుపొందితే, 2018లో ఖమ్మంలో పువ్వాడ అజరుకుమార్‌ విజయం సాధించారు. అంతే తేడా. ఓట్లు పెరిగినా సీట్లు రాకపోవడం గులాబీ నేతలను విస్మయానికి గురిచేసింది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన అభ్యర్థులు మార్చి నెలలో ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. తొలుత వైరా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌పై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి లావుడ్యా రాములునాయక్‌ గెలుపొందిన మరుసటి రోజే టీఆర్‌ఎస్‌లో చేరారు. మార్చి2న పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మార్చి10న ఇల్లందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ, 14న పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, 17న కొత్తగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆ వెంటనే సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ గూటికి చేరిపోయారు. కేవలం పదిహేను రోజుల్లోనే ఆరుస్థానాలతో ఉన్న కాంగ్రెస్‌ రెండు స్థానాల కు పడిపోయింది. ఒకే ఒక్కస్థానంలోని టీఆర్‌ఎస్‌ ఏకంగా ఏడు స్థానాలకు ఎగబాకింది. భారీ మార్పులు చోటుచేసుకున్న ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో రెండు, మూడు గ్రూపులతో అంతర్గత పోరు నడుస్తున్నది.టీఆర్‌ఎస్‌ పరాజయం పాలైన నియోజకవర్గాల్లో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, భద్రాద్రిజిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీల్లో ఎన్నికలున్నాయి. అక్కడ గెలుపు బాధ్యతంతా స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించడంతో పరిస్థితి కత్తిమీద సాములా తయారైంది. ముందస్తు పోరులో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి మారిపోయారు. వారు ఓడిపోయిన అభ్యర్థులతో ఎంత మేరకు సమన్వయం చేసుకుని గట్టెక్కిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, ఓడినవారికి మధ్య వర్గపోరు ఉందన్న చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్రకు, అతని చేతిలో ఓడిన పిడమర్తి రవి, ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియకు, ఓడిపోయిన కోరం కనకయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. వైరాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మదన్‌లాల్‌ను ఓడించిన స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్‌ మధ్య ఉన్న విబేధాలు చెప్పక్కరలేదని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వనమా, అక్కడ ఓడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి జలగం వెంకటరావు మధ్య ఎంత సఖ్యత ఉంటుందో వేచిచూడాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మధిర నియోజకవర్గంలో సీఎల్‌పీ నేత మల్లుభట్టి విక్రమార్క వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌లో ఉన్న రెండు వర్గాల పోరు ఎంతమేరకు విజయాన్ని అందిస్తుందో వేచిచూడాలి. అయితే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గత శాసనసభ ఫలితాలే వస్తాయేమోనని ఎమ్మెల్యేలు కాస్తంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.