అనంతకు జీడీపల్లి జలాలు కోసం ఎదురు చూపులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనంతకు జీడీపల్లి జలాలు కోసం ఎదురు చూపులు

అనంతపురం, జనవరి 23,(way2newstv.com)
తాము అధికారంలోకి వస్తే అవి చేస్తాం... ఇవి చేస్తాం.. ఎలాంటి సమస్యలపైనే నేరుగా తమతో చెప్పుకుంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం... అని చెప్పిన పాలకుల మాటలు నీటిమూటలగానే మారుతున్నాయి. కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌కు జీడిపల్లి జలాలు వచ్చేదెన్నడోనని మండల రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు మంత్రులు, జిల్లా అధికారులు జీడిపల్లి నుంచి నీరు తెచ్చేందుకే కృషి చేస్తున్నామని చెబుతున్నారు. కుందుర్పి కెనాల్‌కు జీడిపల్లి నీటిని తెచ్చేందుకు అసెంబ్లీలో కూడా చర్చలు జరిగాయి.
అనంతకు జీడీపల్లి జలాలు కోసం ఎదురు చూపులు

అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని మండలాల గురించి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, ఎంపి జెసి.దివాకర్‌రెడ్డిలు ప్రస్తావిస్తున్నారని, కుందుర్పి మండల బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని తేవడంలో ప్రస్తావించడంలో నోరుమెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండల వ్యాప్తంగా 60వేల మంది జనాభా, కెనాల్‌ కింద ఐదు చెరువులు, ఈ చెరువుల్లో ఒక్కొక్క చెరువు కింద 120 నుంచి 150 ఎకరాల దాకా వ్యవసాయ భూములున్నాయి. దాదాపు వాటిపైన వందలాది మంది రైతులు ఆధారపడి ఉన్నారు. మండలంలోని కుందుర్పి, నిజవళ్లి, మలయనూరు, అపిలేపల్లి, బసాపురం చెరువుల కింద దాదాపు 700 ఎకరాలకు గాను 1200 మంది రైతులు ఉన్నారు. దీంతోపాటు కాలువల ద్వారా చెరువులకు నీరందిస్తే సుమారు వేలాది ఎకరాల్లో పంటలు పండించేందుకు అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే, ఎంపిలు మాత్రం జీడిపల్లి నుంచి బిటిపికి నీరు తెస్తామని చెబుతున్నారే తప్పా, కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు తెస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి ప్రస్తావన లేక పోయిందన్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాల కాల వ్యవధి పూర్తైనా ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పటి దాకా ఒకింతకూడా అడుగులు ముందుకు వేయక పోవడంతో ప్రజల్లో నిరుత్సాహం నెలకొంది. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులు సాగునీరందిస్తే పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. అనంతపురం జిల్లాకు నీరందిస్తామని ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌కు నీరందిస్తే అలాంటి వారికే పట్టం కట్టిస్తామని మాటలు కూడా ప్రజల నుండి బహిరంగంగా చర్చలు వినవస్తున్నాయి. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో భారీ స్థాయిలో జిల్లాలోనే కరువులో కొట్టుమిట్టాడుతున్న కుందుర్పి మండల ప్రజలు, రైతులు ఇబ్బందులు గుర్తించి, వలసలు నివారించాలంటే కేవలం చెరువులకు నీరు తేవడమనేని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా జీడిపల్లి రిజర్వాయర్‌ నుండి కుందుర్పి బ్రాంచ్‌ కెనాల్‌కు కృష్ణాజలాలు అందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.