మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీ
హైదరాబాద్ జనవరి 9 (way2newstv.com)
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉంది. టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు: కేసీఆర్
టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్ పదవులు, ఇతర అవకాశాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన జరగనుంది. తిరస్కరించిన నామినేషన్లపై 12వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 గడువు. మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, కార్పొరేషన్లలోని 325 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.