హైద్రాబాద్, జనవరి 25, (way2newstv.com)
చ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఆన్‌లైన్లోనే సమర్పించాలంటూ ప్రభుత్వం అన్ని శాఖలనూ ఆదేశించింది. ఇందుకనుగుణంగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాలంటూ ఆర్థికశాఖకు సూచించింది. ఈ ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకున్నట్టు సమాచారం. మరోవైపు ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో ప్రతిపాదనలను పంపాలంటూ సూచిస్తున్నప్పటికీ పలు శాఖలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆర్థికశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వల్ల బడ్జెట్ రూపకల్పనలో చాలా జాప్యం జరుగుతున్నదని సంబంధిత ముఖ్య కార్యదర్శులకు తెలిపింది.
ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రపోజల్స్
ఫలితంగా పద్దు తయారీలో సమతూకం, సమగ్రత లోపిస్తున్నాయని వివరించినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ఇప్పుడైనా నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలను సమర్పించాలంటూ ఆర్థికశాఖ సూచించింది. వాస్తవానికి డిసెంబరు నెలాఖరులోగా వాటిని పంపాలంటూ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత సంక్రాంతి వరకూ శాఖలకు గడువునిచ్చారు. అయినా ఇప్పటి వరకూ ప్రపోజల్స్ రాలేదని సమాచారం. దీంతో మరో వారం రోజుల వరకూ గడువు పొడిగించినట్టు తెలిసింది.ప్రతిపాదనలను సమర్పించేటప్పుడు పలు రకాల మార్గదర్శకాలను పాటించాలంటూ ఆర్థికశాఖ ఆదేశించింది. ఇప్పటి వరకూ శాఖకు సంబంధించిన జమా ఖర్చులు, నిధులకు సంబంధించి నిల్వ ఎంతుంది..? అనే వివరాలను సమగ్రంగా పొందుపరచాలంటూ కోరింది. వీటితోపాటు కరెంటు, నీటి బిల్లులు, పారిశుధ్యం, భవనాల నిర్వహణ, వాటి మరమ్మతుల కోసం ఎంతెంత ఖర్చు చేశారనే విషయాలన్నింటినీ విధిగా పేర్కొనాలని సూచించింది. ఈ వివరాలను పొందుపరచకపోతే అలాంటి ప్రతిపాదనలన్నింటినీ తిప్పి పంపుతామని హెచ్చరించింది.