కంకర తేలుతున్న రోడ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కంకర తేలుతున్న రోడ్లు

అనంతపురం, జనవరి 31, (way2newstv.com)
 పనుల్లో నాణ్యత పాటించకపోవడం వలన సిమెంట్ రోడ్లు వేసిన కొద్ది రోజులకే కంకర తేలుతున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ షేక్ సురియా భాను వార్డు అయిన 15వ వార్డులోని రెక్కమాను రెండవ వీధిలో నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ భర్త షేక్ బాబ్‌జాన్‌కు సంబంధించిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తుండడం వలన అధికారులు అక్కడకు వెళ్లి నాణ్యతను పరిశీలించలేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోశయ్య ముఖ్యమంత్రిగా కదిరి పర్యటనకు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి నిజాంవలీ పేరు మీద ఏర్పాటుచేసిన నిజాంవలీ కాలనీ అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేశారు. 
కంకర తేలుతున్న రోడ్లు

అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నిధులు మంజూరు కాక పోగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కృషితో కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. దీంతో నిజాంవలీ కాలనీలోని 13, 14, 15వ వార్డుల్లో కాలువలు, రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఏ మాత్రం నాణ్యత విషయంలో ప్రమాణాలు పాటించకపోవడం, అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో కొద్ది రోజులకే సిసి రోడ్లలో కంకర తేలుతున్నాయి. దీంతో ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోని నిజాంవలీ కాలనీ కోటి రూపాయల నిధులతో అభివృద్ధి జరుగుతుందన్న ఆశ ఆ కాలనీవాసుల్లో చాలా రోజులు నిలబడలేదు. సాక్షాత్తు మున్సిపల్ ఛైర్మన్ వార్డులోనే ఇలా నాసిరకం పనులు చేస్తుంటే మున్సిపాలిటీలో మిగిలిన వార్డుల పరిస్థితి ఏమిటని సాటి కౌన్సిలర్లే ప్రశ్నిస్తున్నారు. రూ. కోటి నిధుల్లో కూడా 14, 15వ వార్డుల్లో పనులు చేసి 13వ వార్డులో వివక్ష చూపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 13వ వార్డులో తారు రోడ్డు నిర్మాణానికి కంకరతోపాటు కంకర పొడిని కలిపి వేయాల్సి వుండగా హడావుడిగా మామూలు కంకరనే రోడ్డు కింద వున్న మట్టిని తోడకుండా పరచడం జరిగింది. రోజులైనా ఇక్కడ పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులచే విచారణ చేయిస్తే పనుల నాణ్యతలో జరిగిన అవినీతి బయటపడుతుందని టిడిపికి చెందిన కౌన్సిలర్లే పలుమార్లు కౌన్సిల్‌లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా నిజాంవలీ కాలనీలో కోటి రూపాయల పనులతో చేపట్టిన పనులతోపాటు రూ. 6 లక్షల పనుల్లో నాణ్యత పాటించకపోవడం వలన అభివృద్ధి మూణ్ణాల ముచ్చటగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు.