కొత్త ఊహాగానాలు...
హైద్రాబాద్, జనవరి 4 (way2newstv.com)
కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటీవల చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు కూడా ఈ విషయంపై స్పందించారు. తర్వాతి సీఎం కేటీఆర్ అని, ముఖ్యమంత్రి అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ వంటి వారు వ్యాఖ్యానించారు. అయితే, టీఆర్ఎస్‌లోని కొందరు విశ్వసనీయంగా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం.. వచ్చే రెండు నెలల్లోనే సీఎం కుర్చీపై కేటీఆర్‌ను కూర్చోపెట్టనున్నారని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిశాక ఇది ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది.అయితే, తన ఆరోగ్యానికి ఏ ఢోకా లేదని సీఎంగా తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ కూడా మరో పదేళ్లు సీఎంగా కేసీఆరే ఉంటారని స్పష్టతనిచ్చారు.
తెలంగాణలో సీఎం మార్పు..
అయినా, ఇటీవల మంత్రులు వరుసగా ‘‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్’’ అనే అంశంపై తరచూ స్పందిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్ సీఎం అవడం మరెంతో దూరంలేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, కేటీఆర్‌కు లభిస్తున్న ప్రాధాన్యం, ఇంకా మరికొన్ని సంకేతాలు కూడా కారణమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2018 డిసెంబరులో పార్టీలో కీలక బాధ్యత అయిన కార్యనిర్వహక అధ్యక్షుడిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టాక అంతర్గత వ్యవహారాలన్నీ ఆయన అధీనంలోనే జరుగుతున్నాయినిజానికి భవిష్యత్తు సీఎం కేటీఆర్ అనే చర్చ 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముందే మొదలైంది. ఆ సమయంలో కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలపై కన్ను వేయడంతో, రాష్ట్రంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని ఎన్నికలకు ముందు అంతా అనుకున్నారు. ఫెడరల్ ఫ్రెంట్ ద్వారా కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతారని టీఆర్ఎస్ వర్గాలు ఆశించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. కేటీఆర్ సీఎం పగ్గాలు చేపడతారని అన్నారు. అయితే, అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం అంచనాలు తప్పాయి. కేంద్రంలో బీజేపీకి భారీ మెజారిటీతో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నం ఫలించలేదు.