రాజమండ్రి, జనవరి 21, (way2newstv.com)
పాపికొండలు జాతీయ పార్కుకు రక్షణ కరువైంది.దాదాపు పదేళ్ల తర్వాత అటవీ శాఖ విభాగాలను పునర్వ్యవస్థీకరించి పటిష్టపరుస్తున్నారు. పాపికొండల ప్రాంతం 1998 వరకు పాపికొండల అభయారణ్యంగా ఉండేది. 590 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే ఈ అటవీ ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుని 1012 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించారు. 2008లో దీన్ని పాపికొండలు జాతీయ పార్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాపికొండలు జాతీయ పార్కుగా నిర్దేశించిన ప్రాంతంలో రిజర్వు ఫారెస్టు, కొన్ని రెవెన్యూ గ్రామాలు, కొంత ముంపునకు గురయ్యే ప్రాంతం కూడా ఉన్నాయి. విస్తీర్ణం పెరిగిన ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, సంరక్షించడానికి అవసరమైన మేర సిబ్బంది నియామకం జరగలేదు.
గాలికొదిలేసిన పాపికొండల రక్షణ
దీనితో విలువైన అటవీ సంపద, అరుదైన జంతు జాతుల సంరక్షణ గాలికొదిలేశారుఅటవీ శాఖ వన్యప్రాణి విభాగంలో సిబ్బంది కొరత కారణంగా పహారా గాలికొదిలేశారు. ఎంతో విలువైన వృక్ష సంపద, అరుదైన జంతువులు కలిగిన పాపికొండలు జాతీయ పార్కు సంరక్షణ దైవాధీనంగా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో రేంజిల పునర్వ్యస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. పాపికొండలు అరణ్యాన్ని పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ప్రభుత్వం పాపికొండలు జాతీయ పార్కుగా ప్రకటించింది. అప్పటి నుంచి సిబ్బంది కొరతతో సంరక్షణ అరకొరగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్లకుగానీ పునర్వ్యవస్థీకరణకు చర్యలు చేపట్టలేకపోయారు. జీవ వైవిధ్యానికి చాలా కీలకమైన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి నడుంబిగించారు. అటవీ శాఖలో టెరిటోరియల్ విభాగం, సోషల్ ఫారెస్ట్రీ విభాగం, వన్యప్రాణి సంరక్షణా విభాగం, లాగింగ్ అండ్ విస్తరణ విభాగం, రీసెర్చి అండ్ ట్రైనింగ్ విభాగం ఉన్నాయి. పాపికొండల జాతీయ పార్కులోని వన్యప్రాణి సంరక్షణ బాధ్యతలను చూడాల్సిన విభాగానికి సరైన సిబ్బంది లేరు. 26 మంది రేంజర్లు, సిబ్బంది ఉండాల్సిన ఈ విభాగంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. చింతూరు డివిజన్ పరిధిలో చింతూరు, కూనవరం, విఆర్ పురం, లక్కవరం, ఎటపాక రేంజిలు ఉన్నాయి. ఇందులో వీటిలో చింతూరు, విఆర్ పురం రేంజిల్లో మాత్రమే పాపికొండలు నేషనల్ పార్కు ఉంది. దీంతో ఈ రెండు రేంజిలను రాజమహేంద్రవరం వన్యప్రాణి విభాగంలో విలీనం చేశారు. అదేవిధంగా కాకినాడ డివిజన్ పరిధిలో ఉన్న కాకినాడ, ఏలేశ్వరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం, సూదికొండ, రంపచోడవరం రేంజిలు ఉన్నప్పటికీ రంపచోడవరం, గోకవరం రేంజిల్లో మాత్రమే పాపికొండల నేషనల్ పార్కు పరిధి ఉంది. దీంతో ఈ రెండు రేంజిలను కూడా రాజమహేంద్రవరం డిఎఫ్‌ఒ పరిధిలో విలీనం చేశారు. ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, పోలవరం, కుకునూరు రేంజిలకుగాను పోలవరం, కుకునూరు రేంజిలలోనే పాపికొండల నేషనల్ పార్కు పరిధి ఉంది. దీంతో ఈ రెండు రేంజిలను కూడా వన్యప్రాణి విభాగం రాజమహేంద్రవరం డిఎఫ్‌ఒ పరిధిలోకి మార్చుతూ ప్రతిపాదించారు. జాతీయ పార్కు సంరక్షణ వ్యవహారం ఒకే గొడుగు కిందకు రావడంతో పర్యవేక్షణ, సంరక్షణ సులభమయ్యే అవకాశముంది.
Tags:
Andrapradeshnews