దూకుడు పెంచిన ఏసీబీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దూకుడు పెంచిన ఏసీబీ

విజయవాడ, జనవరి 8  (way2newstv.com)
ఏసీబీ డీజీగా సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు బాధ్యతలు తీసుకున్న విజయవాడలో మెరుపుదాడులు నిర్వహించింది ఏపీ అవినీతి నిరోధక శాఖ. ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రీజనల్‌ మేనేజర్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంల మేరకు దాడులు చేసినట్లు తెలుస్తోంది.మేనేజర్ రామకృష్ణ ఇంటితో సహా పలు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏలూరు, హైదరాబాద్‌, చెన్నైలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఏలూరులోని రామకృష్ణ ఇంటిలో రెండు లాకర్లను గుర్తించినట్లు సమాచారం. సుమారు 8.67 లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సస్పెన్షన్‌లో ఉన్న అధికారి ఇంట్లో దాడులు నిర్వహించడం విశేషం.
దూకుడు పెంచిన ఏసీబీ

విజయవాడలో ఏసీబీ దాడులతో ఒక్కసారిగా సంచలన రేగింది. మొత్తం ఏడు చోట్ల దాడులు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏసీబీపై గత వారం జరిగిన సమీక్షలో వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నెలరోజుల్లో మార్పు రావాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అనంతరం అనూహ్యంగా ఏసీబీ డీజీపై బదిలీ వేటు వేసింది జగన్ సర్కార్.ఏసీబీ డీజీగా ఉన్న కుమార్ విశ్వజీత్‌ను పక్కన బెట్టి సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులును ఏసీబీ డీజీగా నియమించారు. రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న సీతారామాంజనేయులును సోమవారమే ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి రోజే విజయవాడలో ఏసీబీ దాడులు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా అవినీతి కనిపించకూడదని.. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు. ఏసీబీ తీరుపై అసంతృప్తితో ఉన్న జగన్.. ఆ శాఖ బాస్‌ను మార్చేందుకు కూడా వెనుకాడలేదు. సీతారామాంజనేయులను ఏరికోరి ఏసీబీ డీజీగా నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే దాడులు జరగడంతో ఇక ఏసీబీ వేట మొదలైందా? అన్న చర్చ జోరందుకుంది.