కాకినాడ, జనవరి 21, (way2newstv.com)
జనసేన తో పొత్తు రేపొద్దున్న చెడితే ? గత అనుభవాల దృష్ట్యా ఈ ప్రశ్న కు జవాబు వెతికే పనిలో బిజీ అయ్యింది బిజెపి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరు కనుక తమ జాగ్రత్తలో తాము ఉంటే పోయేదేమీ ఉందని ముందుచూపుతో అడుగులు వేస్తుంది కమలం. బలమైన సామాజిక వర్గం దీనికి తోడు అత్యంత ప్రజాకర్షణ వున్న పవన్ కల్యాణ్ రేపు తమ అవసరం తీరాక కానీ 2024 ఎన్నికల ముందు బిజెపి కి గుడ్ బై కొడితే తిరిగి పార్టీ పూర్వ స్థితికి చేరుతుందన్న లెక్కలు కమలనాధులు ముందుగానే అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల ముందు బిజెపి గెలుపుకోసమే పొత్తుకు సిద్ధమై ఆ తరువాత యు టర్న్ కొట్టి టిడిపి తో లోపాయికారి అవగాహనతో తమ పార్టీపై బురదజల్లిన జనసేనాని వ్యూహాలు ఎలా అమలు చేసినా తిప్పికొట్టేందుకు పటిష్టమైన ఆలోచనతోనే కమలం కసరత్తు ఇప్పుడు మొదలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.కోస్తాలో కాపు సామాజిక వర్గం అత్యధికం.
కాపు కాసే పనిలో కమలం నేతలు
వారికి కులదైవంగా మారిపోయారు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. పవర్ స్టార్ తో సమానమైన క్రేజ్ ఆ సామాజిక వర్గంలో ముద్రగడకు ఉందనే చెప్పాలి. పైగా దూకుడుగా రాజకీయాలు చేయడం కానీ ఎవరికీ భయపడకుండా ఉద్యమాలు చేయడం ముద్రగడకు వెన్నతో పెట్టిన విద్య. సరిగ్గా ఈ పాయింట్స్ అన్ని తమ పార్టీకి ప్లస్ అవుతాయన్న లెక్కలతో ఏపీ బిజెపి లో కీలక నేత ఎమ్యెల్సీ సోము వీర్రాజు ముద్రగడతో రహస్య చర్చలకు తెరతీశారు. ఈ వివరాలను ఇరువురు నేతలు వెల్లడించనప్పటికీ రాబోయే రోజుల్లో ముద్రగడ కమలం లో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీలో చేరని ఆయన కాపు రిజర్వేషన్ల అంశంపై మాత్రం నిలదీస్తూనే వున్నారు. ముద్రగడ గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా బిజెపి లో ఆయనకు సముచిత స్థానం లభిస్తే మాత్రం ఆయన కమలం తీర్ధం పుచ్చుకోవడం లాంఛనమే కానుంది.జనసేన ఆకస్మికంగా బిజెపి నేతల చుట్టూ తిరిగి పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు డైరెక్షన్ అని వైసిపి ఆరోపిస్తుంది. బిజెపి తనను దూరం పెట్టడంతో తన రహస్య స్నేహితుడిని ఆ పార్టీకి దగ్గర చేసి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా చేయాలనే ఆయన్ను పంపారని వైసిపి తీవ్ర స్థాయిలోనే విమర్శిస్తోంది. బిజెపి – జనసేన కలయికపై ఒక పక్క వైసిపి అగ్గిమీద గుగ్గిలం అయ్యి విమర్శల దాడి చేస్తుంటే సాక్షాత్తు టిడిపి అధినేత సంతోషం వ్యక్తం చేయడం ఫ్యాన్ పార్టీ ఆరోపణలు నిజమేనా అనే సందేహాన్ని సామాన్యుల్లో సైతం వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. అందుకే బిజెపి పార్టీ విస్తరణ అభివృద్ధిపై జనసేన వంటి పార్టీలపై ఆధారపడకుండా సొంత వ్యూహంతో ముందుకు సాగాలనే అజెండా తో వెళుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ముద్రగడ కమలం తీర్ధం పుచ్చుకుంటే మాత్రం తమ పార్టీలోనూ కాపు సామాజిక వర్గం స్టార్ ఒకరున్నారనే విషయం పవన్ గుర్తుపెట్టుకుని గతంలో తమకు ఇచ్చిన షాక్ లు ఇచ్చే ఛాన్స్ లేకుండా చేయాలని చూస్తున్నట్లు తేలిపోతుంది.