సిటీలో భారీగా కమర్షియల్ భవనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిటీలో భారీగా కమర్షియల్ భవనాలు

హైద్రాబాద్, జనవరి 2, (way2newstv.com)
దేశమంతా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నట్లు వార్తలొస్తున్నప్పటికీ మన నగరంలో మాత్రం నిర్మాణాల జోరు తగ్గలేదు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు జీహెచ్‌ఎంసీ ద్వారా నివాస, వాణిజ్య భవనాలన్నీ కలిపి 16,832 అనుమతులు మంజూరు కావడమే ఇందుకు నిదర్శనం. వీటి ద్వారా ఫీజులరూపంలో జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు రూ. 987కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ. 132కోట్లు అదనం.జీహెచ్‌ఎంసీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16,105 అనుమతులు మంజూరు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 696 అనుమతులు అదనంగా, అంటే 16,801అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో మొత్తం 6.83 కోట్ల చదరపు అడుగులమేర నివాస అపార్ట్‌మెంట్ల బిల్టప్‌  ఏరియాకు అనుమతులు ఇచ్చారు. 
 సిటీలో భారీగా కమర్షియల్ భవనాలు

అలాగే, 32 లక్షల చదరపు మీటర్లకుపైగా వాణిజ్య భవనాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్‌ 27వ తేదీవరకు నగరంలో వాణిజ్య, నివాస, హైరైజ్‌ భవనాలు కలిపి మొత్తం 16,801 నిర్మాణ అనుమతులు మంజూరు చేయగా, వాటిపై ఫీజుల ద్వారా రూ. 987 కోట్లమేర ఆదాయం జీహెచ్‌ఎంసీకి సమకూరింది. ఇందులో 14,663 అనుమతులు సర్కిల్‌ స్థాయిలోని మూడు అంతస్తులలోపు వ్యక్తిగత నివాస భవనాలు కాగా, 1,415 అనుమతులు జోనల్‌ స్థాయిలో ఐదు అంతస్తుల వరకు ఉండే భవనాలు ఉన్నాయి. ఇందులో 1,332 నివాస భవనాలు కాగా, మిగిలిన 83 వాణిజ్య భవనాలున్నాయి. ఇవి కాకుండా ఐదు అంతస్తులకన్నా ఎక్కువ ఎత్తు భవనాలు, హైరైజ్‌ బిల్డింగ్‌లు అన్నీ కలిపి 723 అనుమతులు ప్రధాన కార్యాలయం నుంచి మంజూరయ్యాయి. ఇందులో 570 నివాస, హైరైజ్‌ భవనాలు కాగా, 153 వాణిజ్య భవనాలున్నాయి.మొత్తం 1902 నివాస అపార్ట్‌మెంట్లకు అనుమతులు మంజూరుచేయగా, వాటి మొత్తం బిల్టప్‌ ఏరియా 63,49,766 కావడం విశేషం. అంటే, 6,83,48,312 చదరపు అడుగుల మేర నివాస అపార్ట్‌మెంట్లకు అనుమతులు మంజూరుచేశారన్నమాట. వీటిల్లో మొత్తం అపార్ట్‌మెంట్‌ యూనిట్లు 37,328. అలాగే, 236 వాణిజ్య భవనాలకు అనుమతులు మంజూరు కాగా, వాటి బిల్ట ప్‌ ఏరియా 3232416 చదరపు మీటర్లు. అటు వాణిజ్య, ఇటు నివాస భవనాల అనుమతులు గత ఆర్థిక సంవత్సరం కన్నా ఎంతో ఎక్కువగా ఉండడాన్నిబట్టి ఆర్థిక మందగమనం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే నగరంలో తక్కువని స్పష్టమవుతుంది.