ఒంగోలు, జనవరి 11, (way2newstv.com)
రాజకీయాల్లో వారసత్వం మామూలే. వారసుడు సరైనోడైతేనే అనుకూల ఫలితాలు వస్తాయి. లేదంటే బూమ్ రాంగ్ తప్పదు. టైమింగ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. టైమింగ్ సక్రమంగా లేక పరిటాల శ్రీరామ్, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ పవన్ కుమార్ రెడ్డిలు వారసులుగా దిగి అరంగేట్రంలోనే అభాసుపాలయ్యారు. అయితే ప్రకాశం జిల్లా పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన రాజకీయ వారసుడిని బరిలోకి దించేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటి నుంచే వారసుడిని ప్రజల్లో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.ఒంగోలు రాజకీయాల నుంచి మాగుంట కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. మాగుంట సుబ్బరామిరెడ్డి 1990వ దశకంలో ఒంగోలు రాజకీయాల్లోకి వచ్చారు. పారిశ్రామికవేత్తగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ వేత్తగా మారిన తర్వాత చిరస్థాయిగా పేరు నిలిచేలా ఆయన వ్యవహరించారు.
మాగుంట రిటైర్అయినట్టేనా
ప్రధానంగా సేవా కార్యక్రమాలను అనేకం నిర్వహించిన మాగుంట ఎంపీ అంటే ఇలా ఉండాలని అని ప్రజలకు తొలిసారి తెలియజెప్పారు. ఆ తర్వాత వచ్చిన వారెవరైనా మాగుంట అడుగుజాడల్లో నడవాల్సిందే.1995లో మాగుంట సుబ్బరామిరెడ్డి నక్సల్స్ చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసురాలిగా మాగుంట పార్వతమ్మ వచ్చి ఒకసారి ఎంపీగా, మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్వతమ్మ రాజకీయాలకు పూర్తిగా దూరం కావడంతో సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆయన వారసుడిగా వచ్చారు. మాగుంట ఆశయాలనే కొనసాగిస్తున్నారు. మాగుంటకు ఇద్దరు సోదరులు, మరో సోదరుడు సుధాకర్ రెడ్డి పూర్తిగా వ్యాపారాలకు పరిమితమయ్యారు. మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోంది.మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకుని, ఆయన కుమారుడు రాఘవరెడ్డికి బాధ్యతలను అప్పగించాలని డిసైడ్ అయ్యారు. రాఘవరెడ్డి ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మాగుంట ఛారిటబుల్ ట్రస్ట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక వైసీపీ యువనేతలతో భేటీ అవుతున్నారు. మాగుంట రాఘవరెడ్డి చేతుల మీదుగానే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో కుమారుడు పోటీకి దిగడం ఖాయంగా కన్పిస్తుంది. జనరేషన్ మార్పు కూడా రాజకీయాల్లో అవసరం కదా మరి.