హైద్రాబాద్, జనవరి 2, (way2newstv.com)
తెలుగు సినీ పరిశ్రమకు సాయం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అందరం కలిసి చర్చించుకుందామనీ ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులకు పిలుపునిచ్చారు. ఓ కార్యాచరణ రూపొందించుకొని సీఎం కేసీఆర్‌కు వివరిద్దామని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమకు సాయం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ ఏడాది రెండు, మూడు ఈవెంట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చిరంజీవి తెలిపారు.
సాయం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం : చిరంజీవి
నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌తో పాటు ఇతర యువ కథానాయకులను కూడా ఈ ఈవెంట్‌లో భాగం కావాలని కోరతానని చెప్పారు. తాను అడిగితే వారు తప్పక ఒప్పుకుంటారని చెప్పారు. ఇండస్ట్రీకి సంబంధించి అన్ని వివరాలను డైరీలో పొందుపరచినట్టు తెలిపారు.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను సినీ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ సినీ ప్రముఖలందరితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున.. సీఎం వ్యాఖ్యలకు హర్షం ప్రకటించారు.హైదరాబాద్‌లో ఏడాదికి 250 సినిమాల వరకు నిర్మితమవుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరంలో రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియో తదితర ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయని గుర్తుచేశారు. సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి భాగ్యనగరంలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గతంలో తనను కలిసినప్పుడు ఇదే అభిప్రాయాన్ని చెప్పారని ముఖ్యమంత్రి వెల్లడించారు.