డబుల్ అయిన ప్లాట్ ఫాం టిక్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డబుల్ అయిన ప్లాట్ ఫాం టిక్కెట్లు

హైద్రాబాద్, జనవరి 9 (way2newstv.com)
సంక్రాంతి పండగ వేళ దక్షిణ మధ్య రైల్వే తన అస్త్రాన్ని ప్రయోగించింది ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను 100 శాతం పెంచుతూ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి పెంచేసింది. ఈ ధరల పెంపు జవనరి 9 నుంచి 19 రోజుల పాటు అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. తొలిసారి నాలుగు రోజులు, గతేడాది వారం రోజుల పాటు ఈ రేట్లను వర్తింపజేసిన అధికారులు ఈసారి ఏకంగా 11 రోజులకు పెంచడం గమనార్హం.మామూలుగానే రద్దీగా ఉండే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు పండుగ సమయాల్లో జనంతో కిక్కిరిసిపోతాయి. ప్రయాణికుల సంఖ్యకు సమానంగా వారిని సాగనంపేవారూ వస్తుండటంతో రైల్వే స్టేషన్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. 
డబుల్ అయిన ప్లాట్ ఫాం టిక్కెట్లు

ఈ ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రత్యేక వడ్డింపు ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలనేది రైల్వే అధికారుల ఆలోచన.దక్షిణ మధ్య రైల్వే గత మూడేళ్లుగా దసరా, సంక్రాంతి పండుగ సమయాల్లో ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను పెంచుతోంది. అయితే.. కొంత మంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రైల్వే అధికారులకు ఝులక్ ఇస్తున్నారు. ఎంఎంటీఎస్ టిక్కెట్టు ధర కనిష్టంగా రూ.5 ఉంది. ఈ టిక్కెట్‌తో రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించి.. గంటల తరబడి గడుపుతూ టికెట్ కలెక్టర్లకు సవాలు విసురుతున్నారు.కొంత మంది రూ.5 ఎంఎంటీఎస్ టిక్కెట్‌తో రెండు విధాలా లబ్ధి పొందుతున్నారు. తమ బంధువులకు వీడ్కోలు పలకడమే కాకుండా.. ఉచిత వైఫై సేవలను కూడా పొందుతున్నారు. కేవలం వైఫై సౌకర్యం కోసమే కొంత మంది రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలపై తిష్ట వేస్తుండటం గమనార్హం.దక్షిణ మధ్య రైల్వే నెలకు సుమారు 15 లక్షల ప్లాట్‌ఫాం టికెట్లను విక్రయిస్తోంది. వీటి ద్వారా రూ.1.5 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతోంది. పండుగ సమయాల్లో పెంచిన రేట్లు అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. అయితే.. ఇదే సమయంలో రోజుకు సుమారు 1000 మంది వరకు టోకరా ఇస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.