విజయవాడ, జనవరి 3(way2newstv.com)
మూడు రాజధానుల ప్రకటన జగన్ ఎప్పుడైతే అసెంబ్లీలో చేశారో అప్పటినుంచి ఏపీ బీజేపీ కి మనశ్శాంతి లేకుండా పోయింది. బీజేపీ అజండానే వైసిపి సర్కార్ అమల్లోకి పెడితే ఇది మా ఆలోచనే అని కొందరు నేతలు ప్రకటించి ఆ తరువాత లేదు అమరావతికి జై అని కొందరు మాట్లాడే పరిస్థితికి కమలం వెళ్ళిపోయింది. అసలు భారతీయ జనతాపార్టీ లో మూడు రాజధానుల అంశంపై ఒక లైన్ అంటూ లేకుండా గందరగోళ పరిస్థితికి నేతలు తెచ్చారనే చెప్పాలి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రూట్ ఒకటి రాజ్యసభ సభ్హ్యుడు సుజనా చౌదరి ది మరో రూట్, ఇక కమలం అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహ రావు వైఖరి మరొకటి, అలాగే మాజీ సీఎస్ ప్రస్తుత బిజెపి లీడర్ ఐవైఆర్ ది మరొకటి, బిజెపి లో మరో కీలక నేత సోము వీర్రాజు దారి ఇంకో వైపు.
ఆ ముగ్గురు..మూడు దార్లు
ఇలా వుంది పరిస్థితి.కొత్త ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఇదే ధోరణి తో ఎపి అగ్రనేతల వ్యవహారం సాగుతుండటం బీజేపీ శ్రేణులనే కాదు ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది. అసలు రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం మనసులో మాట ఇది అని జనం తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. మరో పక్క కీలకమైన అంశాల్లో రాజకీయంగా మంచి మైలేజ్ పొందే అవకాశం వున్నా బిజెపి చేజార్చుకుంటుందన్న వాదనలు వినవస్తున్నాయి. చిన్న రాష్ట్రాలతో సమతుల అభివృద్ధి అన్నది బీజేపీ అజండా. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది ఆ పార్టీ మొదటి నుంచి చెబుతున్నదే. రాయలసీమ హై కోర్టు, ఉత్తరాంధ్ర అభివృద్ధి పై గట్టి గొంతునే ఇన్నాళ్ళు బీజేపీ వినిపిస్తూ వచ్చేది. అయితే ఎప్పుడైతే టిడిపి లోని కొందరు ముఖ్యులు కమలం లోకి జంప్ అయ్యారో అప్పటినుంచి పార్టీ లైన్ ఇది అన్న మాటే లేకుండా పోయింది. ఇదంతా టిడిపి వెనుకనుంచి నడిపిస్తూ ఎపి లో బీజేపీ ఎదుగుదలను దెబ్బతీస్తుందన్న అనుమానాలు కరడుగట్టిన కమల నాధుల్లో వున్నాయి. కానీ వారు ఇప్పుడు కేంద్ర నాయకత్వ అవసరాల రీత్యా ఇప్పట్లో నోరు మెదపలేని పరిస్థితి ఉందంటున్నారు.ఏపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షణకు నియమించిన సునీల్ దేవధర్ కొంతకాలం అందరిని ఒక గాటిన కట్టి నడిపించే ప్రయత్నం బాగానే చేశారు. అయితే ఇటీవల ఆయన జోరు కూడా బీజేపీ లో తగ్గింది. అధిష్టానం ఇతర వ్యవహారాలు అప్పగించడంతో ప్రస్తుతం సునీల్ పూర్తి సమయం ఏపీ బీజేపీ మీద పెట్టలేకపోతున్నారని అంటున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న అధిష్టానం విషయం బాగా కాక మీద వున్నప్పుడు ఆయన్ని సీన్ లోకి దింపి శుభం కార్డు వేయాలని చూస్తున్నట్లు ఆ పార్టీలో టాక్. అయితే ఇప్పటికే బీజేపీ లో నేతలు తలో మాట తలో బాటగా చేస్తున్న ప్రయాణం ఆ పార్టీకి తేవాలిసిన డ్యామేజ్ తెచ్చేసింది. దాంతో ఇప్పుడైనా మేల్కొని మరమ్మత్తు చేసుకోక తప్పదని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.