సెకండ్ ఇన్నింగ్స్ కు శివాజీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సెకండ్ ఇన్నింగ్స్ కు శివాజీ

శ్రీకాకుళం, జనవరి 6, (way2newstv.com)
ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యే. కీలకమైన నేత. తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్. తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కుమార్తెను రంగంలోకి దించడంతో ఓటమి తప్పలేదు. దీంతో ఆయన తన ప్రకటనను ఉపసంహరించుకుని రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా? అన్న చర్చ జరుగుతుంది. ఆయనే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యాంసుందర శివాజీ.గౌతు శ్యాంసుందర శివాజీ గతంలో ఉన్న సోంపేట, ప్రస్తుతం పలాస నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ముక్కు సూటి మనస్తత్వం. ప్రజలకు అందుబాటులో ఉండే నేత. ఏమాత్రం ప్రజావ్యతిరేకతను కొని తెచ్చుకోరు. 
సెకండ్ ఇన్నింగ్స్ కు శివాజీ 

అనుచరుల సంఖ్యతో పాటు ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేకసార్లు ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. 2014లో కూడా మంత్రి పదవి గౌతు శ్యాంసుందర శివాజీకి మిస్ అయింది.అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడటం గౌతు శ్యాంసుందర శివాజీ ప్రత్యేకత. నిజాయితీపరుడిగా పేరుగాంచిన శివాజీ 2014 ఎన్నికల్లో పలాస నుంచి గెలిచిన తర్వాత కొందరు అనుచరులు, అల్లుడు కారణంగానే అప్రదిష్టను మూటగట్టుకున్నారు. ప్రత్యర్థులకు అస్త్రాలను అందించారు. అయితే 2014 తర్వాత తనకు మంత్రి పదవి రాకపోవడంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని గౌతు శ్యాంసుందర శివాజీ ప్రకటించారు. తన కుమార్తె గౌతు శిరీషను బరిలోకి దింపారు.జగన్ సునామీలో గౌతు శిరీష ఓటమి పాలయ్యారు. గౌతు కుటుంబానికి ఓటమి ఎదురు కావడంతో నిర్ణయం మార్చుకోవాలని శివాజీపై వత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లోనూ శివాజీ అయితే గెలిచేవారని ఆయన సన్నిహితులు చెబుతుండటం విశేషం. దీంతో గౌతు శ్యాంసుందర శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తారని చెబుతున్నారు. నికార్సయిన నేత తిరిగి రాజకీయాల్లోకి రావడం మంచిదే. త్వరలోనే శివాజీ భవిష్యత్ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.