విజయవాడ, జనవరి 31, (way2newstv.com)
ప్రభుత్వ మద్యం దుకాణాల అద్దెలకు సంబంధించి రివర్స్ టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. ముందు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో రివర్స్ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త మద్యం విధానంలో భాగంగా సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు దుకాణాల అద్దెలు ఖరారు చేశారు. అయితే ఈ టెండర్లలో గోల్‌మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గతంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న దుకాణాలనే అధిక ధరలకు అద్దెకు తీసుకున్నారని విమర్శలు రావటంతో విచారణకు ఆదేశించారు.
మద్యం షాపుల అద్దెలో గోల్ మాల్.. రివర్స్ టెండర్లు
అద్దె టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. విశాఖలో మద్యం షాపుల అద్దె చదరపు అడుగుకి ఎక్కడాలేని విధంగా రూ. 566 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో అద్దెలు చదరపు అడుగుకి రూ. 22 నుంచి గరిష్టంగా రూ. 40 వరకు మాత్రమే ఉన్నాయి. మద్యం షాపులకు రూ. 50 నుంచి రూ. 70 వరకు చెల్లించవచ్చు. అయితే ఏకంగా రూ. 250 నుండి రూ. 560 వరకు చెల్లించేలా భవన యజమానులతో ఎక్సైజ్ అధికారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మద్యం దుకాణాలు 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. విశాఖలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మద్యం దుకాణానికి నెలకు రూ. 1.70 లక్షలు అద్దె చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు స్థలాలను పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయించాల్సిన అధికారులు హడావుడిగా అధిక మొత్తంలో అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పడు వీటికి రివర్స్ టెండర్లు నిర్వహించి ఖజానాకు ఆదా చేయనున్నారు.