మళ్లీ యాక్టివ్ గా వంగవీటి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ యాక్టివ్ గా వంగవీటి

విజయవాడ, జనవరి 31, (way2newstv.com)
వంగవీటి రాధా… ఇప్పటికయితే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? లేదా? అన్న అనుమానం తలెత్తేది. అయిదే మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తేవడంతో వంగవీటి రాధా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అమరావతి నుంచి రాజధానిని తరలించి, కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్ మాత్రమే ఉంచితే విజయవాడ నగరంలో టీడీపీకి మళ్లీ పట్టు పెరిగే అవకాశం ఉందన్నది వంగవీటి రాధా అంచనా.జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనతో టీడీపీ నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు సయితం సై అంటున్నారు. ప్రధానంగా విజయవాడ సిటీలో వంగవీటి రాధా, జలీల్ ఖాన్ లు వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరారు. ఇప్పుడు వీరిద్దరూ రాజధాని మార్పుతో మళ్లీ యాక్టివ్ అయినట్లే కన్పిస్తుంది. 
మళ్లీ యాక్టివ్ గా వంగవీటి

రాజధాని రైతులకు వంగవీటి రాధా సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనం.వంగవీటి రాధాకు నిజానికి టీడీపీ ఎమ్మెల్సీని చేస్తామని చేరిక సమయంలో ప్రామిస్ చేసింది. అయితే పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఎమ్మెల్సీ దక్కే ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడు శాసనమండలి రద్దు దిశగానే ఉంది. దీంతో వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లే కన్పిస్తుంది. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నేత. అయితే ఆయన పోటీ చేయాలంటే అక్కడ ఇప్పటికే ఉన్న టీడీపీ నేత తాజా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. మరి వంగవీటి రాధా అనుకున్న స్థానం టీడీపీలో దక్కే ఛాన్స్ ఉందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే.వంగవీటి రాధా టీడీపీ నుంచి జనసేనలో చేరదామని తొలుత భావించారు. ఎన్నికల అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కూడా రాధా కలిశారు. కానీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోనే కొనసాగాలని వంగవీటి రాధా నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజధాని మార్పు అంశం బెజవాడలో తనకు కలసి వస్తుందననుకుంటున్నారు. అందుకే రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. మొత్తం మీద వంగవీటి రాధా చాన్నాళ్ల తర్వాత యాక్టివ్ కావడంతో బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది