అన్నీ అక్కడే.. (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అన్నీ అక్కడే.. (నెల్లూరు)

నెల్లూరు, జనవరి 20 (way2newstv.com): 
ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే మీసేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకోవాలి. గ్రామంలో మీసేవ కేంద్రం లేకపోతే మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. దీనివల్ల ప్రజలకు దూరభారంతో పాటు ఆర్థికభారం కూడా అయ్యేది. ఒక్కరోజులో పని పూర్తికాకపోతే మళ్లీ ఇంకో రోజు వెళ్లాలి. అయితే ఇప్పుడు అలాంటి అవస్థలేమి పడకుండానే మనకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను పొందవచ్ఛు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాల్లోనే అన్ని శాఖలకు సంబంధించిన పత్రాలను పొందేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. ఆ మేరకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రభుత్వం అందించే అన్ని సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు సులభంగా అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 
అన్నీ అక్కడే.. (నెల్లూరు)

ఈమేరకు ఇంతకాలం మీసేవ కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రభుత్వమే స్వయంగా అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలకు అన్ని శాఖలకు సంబంధించిన సేవలను అందించేలా ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలను ఇందుకోసం వినియోగించుకోనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించాలన్నది ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. త్వరలోనే గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడిస్తున్నారు. ఈ మేరకు ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజలకు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవస్థ తప్పుతుందనేది నిస్సందేహం. సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదిక ద్వారా మొత్తం 530 సేవలను అందించనుంది. ఇందులో మీసేవలో అందించే 144 సేవలతో పాటు 386 మీసేవయేతర సేవల్ని కూడా అందించనున్నారు.దీని కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గ్రామవార్డుసచివాలయం.ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 11 శాఖలకు సంబంధించిన అధికారులకు మాత్రమే ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశం ఉంటుంది. దీనికోసం ఆయా అధికారులకు ప్రత్యేక పాస్‌వర్డ్‌లు కేటాయించారు. మొత్తం 27 శాఖలకు సంబంధించిన సేవలు అందించే విధంగా వెబ్‌సైట్‌ రూపకల్పన చేశారు. దీనివల్ల పనుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు మరింత సులభం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందించే సేవలకు ప్రస్తుతానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రశీదును అందిస్తారు. మనకు కావాల్సిన పత్రాలను అక్కడే ప్రింట్‌ తీసి అందిస్తారు. ఇందుకోసం అవసరమైన సామగ్రిని గ్రామ సచివాలయాలకు అందించనున్నారు. దీనిలో భాగంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి 2 కంప్యూటర్లు, ఒక ప్రింటర్‌, ఒక యూపీఎస్‌, ఒక లామినేషన్‌ యంత్రాన్ని ఇవ్వనున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇకపై అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏ శాఖకు సంబంధించిన దరఖాస్తు అయిన సరే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేసుకోవచ్ఛు కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌లో స్పందన కార్యక్రమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మన దరఖాస్తు ఎక్కడివరకు చేరుకుందో? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్ఛు