ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
హైదరాబాద్, జనవరి 25 (way2newstv.com)
 రవీంద్రభారతిలో జరిగిన 10వ జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిధిగా హాజరైనారు.  స్టేట్ ఎలక్షన్ కమీషనర్ వి.నాగిరెడ్డి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డా.రజత్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్  పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ  ఓటింగ్ డే ను డెమోక్రసీ డే గా జరుపుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.  చేతివేలి మీద వుండే సిరా గుర్తును చూసుకొని గర్వపడాలని ఓటర్లకు సూచించారు. దేశంలో అత్యంత శక్తిమంతులు ఓటర్లేనని పేర్కొన్నారు. ఓటు వేయుట ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నట్లుగా భావించాలి. ఓటును నిర్లక్ష్యం చేయవద్దు... ఓటు వేయడం మన భాద్యతగా భావించాలి. పోటీలో వున్న అభ్యర్థుల గుణగణాలను బేరీజు వేసుకొని ఓటువేయాలని కోరారు. 
ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

విద్యావంతులున్న పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అనేక మార్పులు తీసుకువస్తున్నదని వివరించారు. పోలింగ్ కేంద్రాలలో కనీస వసతులు కల్పించినట్లు తెలిపారు. ఇటీవల కోంపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ పరిజ్ఞానాన్నిప్రవేశపెట్టినట్లు తెలిపారు. టెండర్ ఓటు పడినచోట రీపోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ప్రతి ఓటరు పోలింగ్లో తప్పని సరిగా పాల్గొనాలని కోరారు. వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూ లైన్లలో నిలబడతామని గుర్తుచేశారు. మత, భాష, ప్రాంతం, కులం, వర్గమునకు అతీతంగా ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. పోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని గౌరవించాలని సూచించారు. ఒక ఓటరుగా తాను మాట్లాడుతున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ...మన దేశంలో ప్రజల అభిప్రాయానికి పూర్వ కాలం నుండి అత్యంత విలువ ఉన్నదని తెలిపారు. ప్రజల అభిప్రాయాన్ని భగవంతుని సూచనగా భావిస్తామని పేర్కొన్నారు. ఒకరికంటే పది మంది అభిప్రాయాలు, భాగస్వామ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వాలు మంచివని తెలిపారు. ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రమని వివరించారు. మన ఎన్నికల వ్యవస్థ పట్ల గర్వపడాలని పేర్కొన్నారు. గత 70 సంవత్సరాల నుండి జరిగిన ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్య పద్దతిలో  ప్రభుత్వాలు మారినట్లు తెలిపారు. అభివృద్ది చెందిన, చెందుతున్న వర్థమాన దేశాల్లో రాజకీయ సుస్థిరత లోపించినప్పటికీ, మన దగ్గర ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాల మార్పు జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా పనిచేస్తున్నదని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ది జరిగినట్లు తెలిపారు.ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) డా.రజత్ కుమార్ మాట్లాడుతూ... 18 సంవత్సరాలు నిండిన  ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా దివ్యాంగుల ఓటరు నమోదుకు గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగ ఓటర్లకు సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రశాంతంగా పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకున్నామని వివరించారు. ఎన్నికల నిర్వహణలో గత సంవత్సరం రాష్ట్రపతి నుండి ఒక జాతీయ అవార్డును పొందినట్లు తెలిపారు. ఈ రోజు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి నుండి రెండు జాతీయ అవార్డులు లభించినట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్లో హైదరాబాద్ సిటీ పోలిస్ కమిషనర్ అంజనీకుమార్, వినూత్న పద్దతులను అమలుచేసిన జగిత్యాల కలెక్టర్ ఎ.శరత్ ఈ జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. మన ఎన్నికల ప్రవర్థన నియమావళికి విశేష ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. వేల సంవత్సరాల భారత నాగరికతను కొనసాగించుటకు మతం, ప్రాంతం, కులం, భాష, వర్గానికి అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఓటరు పై ఉన్నదని చెప్పారు. యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, బి.ఎల్.ఓలు, ఇతర సిబ్బందికి, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు విజేతలకు  రాష్ట్ర స్థాయి అవార్డులను ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అందజేశారు. రెగ్యులర్ గా ఓటు వేస్తున్న సీనియర్ సిటిజన్లకు,  ఓటురుగా నమోదు చేసుకున్న యువ ఓటర్లుకు కొత్త  ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.