విశాఖపట్టణం, జనవరి 28, (way2newstv.com)
ఔను…. కొన్ని విషయాలు వినేందుకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అయితే, అవి నిజం అని తెలిశాక.. నమ్మక తప్పదు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే జనసేనలోనూ చోటు చేసుకుంది. ఎన్నో ఆశలు, ప్రశ్నలతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో గత ఏడాది ఎన్నికలకు ముందుకు చేరిన కీలక నాయకుల్లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఒకరు. ఈయన ఆ ఏడాది ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడం, రూ.100 స్టాంపు కాగితంపై ఆయన తన హామీలను ప్రింటు చేయించి నియోజకవర్గం ప్రజలకు ఇవ్వడం, తాను గెలిస్తే.. నిత్యం ప్రజల మధ్యే ఉంటానని చెప్పడం, పేదలకు అండగా ఉంటూ.. వారి పక్షాన ప్రశ్నిస్తానని చెప్పడం వంటివి తెలిసిందే.అయినా.. కూడా ప్రజలు ఎందుకో.. జేడీలో నాయకుడిని చూడలేక పోయారు.
జేడీ లక్ష్మీ నారాయణ దారెటు..
ఫలితంగా ఆయన ఓటమి పాలయ్యారు. జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఒకటి అనుకున్న విశాఖ ఎంపీ సీటులో జేడీ ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలావుంటే, అప్పటి నుంచి అడపాదడపా ఆయన పార్టీలో ఉన్నా.. గడిచిన నాలుగు మాసాలుగా మాత్రం పూర్తిగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు జనసేనకు మధ్య వైరం వచ్చిందని, త్వరలోనే బీజేపీలో చేరిపోతున్నారని అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ప్రస్తుతం ఇంకా జేడీ జనసేనలోనే కొనసాగుతున్నారు.అయితే, పార్టీ కార్యక్రమాలకు మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు. రాజధానిలో పవన్ పర్యటించినప్పుడు ఆయన పాల్గొనడం కానీ, పవన్ వాయిస్‌కు వాయిస్ కలపడం కానీ ఆయన చేయలేదు. అయినా కూడా ఈ విషయాలు ప్రస్తావించినప్పుడు తాను పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారు. సరే… మరి పార్టీలోనే ఉన్నారు కదా..? మరి పవన్ వెంట ఎందుకు ఉండరు? అని ప్రశ్నిస్తే. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను దాచుకోలేక పోయారు.తాను ఎన్నో ఆశయాలతో ఉద్యోగానికి రిజైన్ చేసి రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన .. ఆ ఆశయాలను, ప్రజల కోణాన్ని జనసేన పట్టుకోలేక పోయిందని, పైపై ప్రకటనలు, పైపై విమర్శలు చేయడం వల్ల ఒరిగేది తక్కువేనని చెప్పేశారు. అంతేకాదు, తాను రాజకీయాల్లో ఉన్నంత సేపూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. పవన్ వైఖరిని జేడీ చెప్పకనే చెప్పారు. బీజేపీతో పొత్తు విషయం కూడా తనతో కనీసం సంప్రదించలేదన్న ఆగ్రహంతో జేడీ ఉన్నారు. ఇదే ఆయనలోని అసంతృప్తికి కారణంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.