విశాఖపట్టణం, జనవరి 23, (way2newstv.com)
శుభమాని ఎవరైనా ముందుకు అడుగేస్తే తుమ్మడం అంటే దారుణమే. సాధారణ ఎన్నికల్లో చిత్తు అయిన పవన్ కళ్యాణ్ తనకో నీడ, తోడు కోసం పాత మిత్రుడు బీజేపీతో చేయి కలిపాడు. ఈసారి బాగా బుద్ధిగా చెప్పిన మాట వినే రాముడిలా ఆయన బీజేపీ వారి పక్కన కూర్చుని మరీ తాను ఎపుడూ కమలధారినేనన్నట్లుగా కలరింగు ఇచ్చుకున్నారు. అది ఆయన రాజకీయ అవసరం మరి. అయితే పవన్ బీజేపీ పొత్తు పెటాకులే అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఈ పొత్తులు మూడు నాళ్ళ ముచ్చటేగా అని ఎకసెక్కమాడుతున్నారు. పవన్ రాజకీయ జీవితంలో ఇలా పొత్తులు, విడిపోవడాలు చాలానే చేశారు కాబట్టి ఆయన మీద పెద్ద డౌట్ ఉందని అంటున్నారు. నిన్న తిట్టిన నోటితోనే ఈ రోజు పొగుడుతారు, రేపు అదే నోటితో తిట్టడని గ్యారంటీ ఏముందని లాజిక్ పాయింటే తీస్తున్నారు మంత్రి అవంతి.
అవంతి శ్రీనివాసరావు మళ్లీ సెటైర్లు
బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఆయన జనసేన పార్టీ, బీజేపీ కలసి ఏపీలో ముందుకు సాగాలనుకుంటున్నాయి. ఇంతవరకూ అందరికీ క్లారిటీ ఉంది. మరి బీజేపీని పవన్ తిట్టడమేంటి. నిజమే గతంలో బీజేపీని పవన్ గట్టిగానే విమర్శించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ డైరెక్ట్ గా మోడీనే ఎకసెక్కం ఆడారు. అయితే అదంతా ఫ్లాష్ బ్యాక్ కధ. గతంలో జరిగినవి మరచిపోయాం. కమ్యునికేషన్ గ్యాప్ తగ్గించుకున్నామంటూ పవన్ స్వయంగా కమలధారులతో కలసి మీడియా ముందుకు వచ్చి చెప్పారు కదా. మళ్ళీ బీజేపీని పవన్ తిట్టే సీన్ ఉంటుందా. అంటే ఏమో ఏం చెప్పాగలం అంటున్నారు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు.ఆయన విమర్శించని వారు ఎవరైనా ఉన్నారా అని కూడా అంటున్నారు.పవన్, బీజేపీ పొత్తు తరువాత 2024 ఎన్నికల మీద గురి పెట్టారు. తామే 2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వస్తామంటూ గట్టిగానే చెప్పుకున్నారు. అయితే వాళ్ళకు అంత సీన్ లేదని అవంతి శ్రీనివాస్ అంటున్నారు. నిజానికి అంతవరకూ ఈ రెండు పార్టీలు కలసి ముందుకు నడిస్తే అదే పెద్ద అద్భుతమని కూడా అవంతి అంటున్నారు. పవన్, బీజేపీ చంకలు గుద్దుకుంటున్నట్లుగా 2024 వరకూ ఈ పొత్తు ఉండే చాన్సే లేదని కూడా ఆయన తేల్చిపారేస్తున్నారు. అప్పటికి ఇంకా నాలుగున్నరేళ్ళ టైం ఉందని. ఈ లోగా పవన్ ఎన్నిసార్లు మారుతారో ఎవరికి తెలుసు అంటూ సెటైర్లు వేస్తున్నారు. పవన్ ది చంచల మనస్తత్వమని, ఆయన ఎపుడేం మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు అని అంటున్నారు.ఇక పవన్ బీజేపీ పొత్తుల వెనక చంద్రబాబు స్కెచ్ ఉందని, ఆయన చెప్పిన మీదటనే పవన్ బీజేపీ నాయకులతో కలసి మీటింగులు పెడుతున్నారని అంటున్నారు. మోడీని దారుణంగా తిట్టిన చంద్రబాబుని బీజేపీ దూరం పెట్టిందని అందువల్లనే దొడ్డిదారిన తన నలుగురు టీడీపీ ఎంపీలను పంపించిన బాబు ఇపుడు పవన్ అస్త్రాన్ని కూడా వాడుకుంటున్నారని అవంతి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మంత్రి గారు డౌట్ పడ్డట్టుగా ఇది మూడు నాళ్ళ ముచ్చటైన మూడవ ప్రత్యామ్యాయమా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.