విజయవాడ, జనవరి 21, (way2newstv.com)
ఒకపక్క రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు, తన కలల కోట కూలిపోకుండా కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే, మరోపక్క, పార్టీలో తీవ్ర వ్యతిరేకత కూడా ఇదే సమయంలో గుప్పుమంటోంది. ఓడిపోయిన నాయకులకు మాత్రమే చంద్రబాబు వాల్యూ ఇస్తున్నారని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఆయనపై గుస్సాగా ఉన్నారని అంటున్నారు. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఇదే తరహా విమర్శలను బహిరంగంగానే చేశారు. గత ప్రభుత్వంలో మంత్రి గా చేసిన దేవినేని ఉమ.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబుకు అన్నీ తానై వ్యవహరించి కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించారనే పేరు తెచ్చుకున్నారు.
చంద్రబాబు పై గద్దె గుస్సా...
ఈ కారణంగా నే సీనియర్లు, పార్టీలో కీలకమైన నాయకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము కూడా పార్టీలోనే ఉన్నామని, తాము కూడా ప్రజల నుంచి గెలిచామని, కానీ, చంద్రబాబు మాత్రం కేవలం ఉమాకే ప్రాధాన్యం ఇస్తున్నారని అప్పట్లో నే నేతలు వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికల్లో ఉమా ఓడిపోయిన తర్వాతకూడా చంద్రబాబు ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎంపీ కేశినేని తన ట్విట్టర్ ద్వారా అనేక సార్లు విమర్శలు గుప్పించారు. అయినా కూడా చంద్రబాబు ఎక్కడా వెనక్కి తగ్గలేదు.ఇక, ఇప్పుడు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే బాబు సామాజిక వర్గానికే చెందిన గద్దె రామ్మోహన్ కూడా ఇదే అభిప్రాయంతో మౌనం పాటిస్తున్నారు. నిగర్వి, నిరాడంబరుడుగా పేరున్న గద్దె తన పనితాను చేసుకుని పోవడం తప్ప పక్కరి వ్యహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకునే పరిస్థితి లేని నాయకుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. రాజధాని కోసం చంద్రబాబు ఇంత హడావుడి చేస్తున్నా.. గద్దె ఎక్కడా కనిపించడం లేదు. ఆయన సతీమణి అనురాధ ఒక్కరే కనిపిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడైనా రాజధాని ఉద్యమం జరుగుతున్నా ఆయన తూతూ మంత్రంగా కార్యక్రమాల్లో కనిపించేసి మమః అనిపించేస్తున్నారు. దీనికి కారణం ఏంటని ఆరాతీస్తే.. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో తాను ఒక్కడినే టీడీపీ జెండాను నిలబెట్టానని, అయినా కూడా బాబు తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నదే ఆయన ఆవేదనగా కనిపిస్తోంది.కృష్ణా జిల్లాలో పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇప్పటికే టీడీపీని వీడారు. ఇప్పుడు జిల్లాలో పార్టీ తరపున గద్దె ఒక్కరే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి టైంలో కూడా బాబు తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఒకటి అయితే… పైగా అసలు జిల్లాలో పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమైన మాజీ మంత్రిదేవినేని ఉమాకే ప్రాధాన్యం ఇస్తున్నారని గద్దె తీవ్రంగా మదన పడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన బాబుకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచన ఏదీ లేక పోయినా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కలివిడిగా లేక పోవడం వల్ల చంద్రబాబు నష్టం వచ్చే అవకాశం మాత్రం ఎక్కువగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. అందుకే గద్దె రామ్మోహన్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన తన సొంత నియోజకవర్గం గన్నవరం బాధ్యతలు తన భార్య అనూరాధకు ఇస్తానని అధిష్టానం చెప్పినా లైట్ తీస్కొన్నారని అంటున్నారు. మరి ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా సరిచేస్తారో చూడాలి.