విజయవాడ, జనవరి 29, (way2newstv.com)
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టడంతో ప్రతిపక్ష టీడీపీ వ్యూహాలకు పదును పెడుతోంది. అవసరమైతే మండలి రద్దు అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. మండలి రద్దు చట్టపరంగా చెల్లదని... అలాంటి అవకాశమున్నా రెండేళ్లు పడుతుందని పార్టీ సభ్యులకు సర్ది చెపుతోంది. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి 34మంది సభ్యులున్నారు. వీరిలో 15 మంది 2021 మార్చి జూన్ నెలలో రిటైర్ కాబోతున్నారు. అలాగే మరో 11 మంది 2023 మార్చిలో రిటైర్ కాబోతున్నారు.నలుగురు 2025 మార్చిలో రిటైర్ అవుతారు. 2021 మార్చి, జూన్ నెలల్లో రిటైర్ అయ్యే వారిలో మండలి చైర్మన్ షరీఫ్, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, తిప్పేస్వామి, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్న, టిడి జనార్దన్, పప్పల చలపతిరావు, ద్వారపురెడ్డి జగదీష్ శమంతకమణి ఉన్నారు.
మండలి రద్దుతో టీడీపీ భవిష్యత్ పై దృష్టి
2023 మార్చిలో రిటైరయ్యే వారిలో నారా లోకేష్, చిక్కాల రామచంద్రరావు, మంతెన సత్యనారాయణ రాజు, ఫరూక్, శత్రుచర్ల విజయరామరాజు ఉన్నారు. అలాగే శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, బిటి నాయుడు, దువ్వారపు రామారావు 2025 మార్చిలో రిటైర్ అవుతారు. కొన్ని రోజులుగా అధికారపక్షం శాసనమండలిని రద్దు చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలను లైట్ గా తీసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అన్నంత పనిచేయడంతో భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. బిల్లులపై చర్చ సందర్భంగా మండలిలో అధికారపక్షం వ్యవహరించిన తీరును... సెలెక్ట్ కమిటీ వ్యవహారాన్ని, శాసన సభలో నిబంధనలను అతిక్రమించి శాసన మండలి గురించి చర్చించటం లాంటి అంశాలను ఎజెండాగా పెట్టుకొని ప్రజల్లోకి వెల్లాలని భావిస్తోంది. టిడిపి ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమై ప్రస్టేషన్‌లో మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. అసలు మండలి రద్దు చేసే అధికారం రాష్ట్రానికి లేదని... కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొస్తోంది. ఇప్పటికే ఐదారు రాష్ట్రాల తీర్మానాలు పెండింగ్‌లో ఉన్నాయని... మరో రెండు మూడేళ్ల వరకు శాసన మండలి రద్దు అనేది జరగదని టిడిపి సీనియర్ నేత యనమల చెప్తున్నారు.శాసన మండలి రద్దుపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోనమాత్రం టిడిపి ఆందోళన ఉంది. శాసనసభలో కేవలం 23 మంది మాత్రమే సభ్యులు ఉన్నప్పటికీ... కౌన్సిల్ కేంద్రంగానే ఇప్పటిదాకా టిడిపి రాజకీయం నడిపింది. మండలి రద్దుతో అనేక మంది నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, యువనేత నారా లోకేష్, మండలి చైర్మన్ షరీఫ్, డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, బుద్ధా వెంకన్న సహా సీనియర్ నేతలంతా రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతారు. వీరందరిదీ ఒక ఎత్తయితే పరుచూరి అశోక్ బాబు, బిటి నాయుడు, దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు ఎన్నికలకు ఒక నెలముందే శాసనమండలి సభ్యులయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వీరు పూర్తిగా నష్టపోయారని చెప్పుకోవచ్చు.టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం మండలి రద్దయితే ఆ సభ్యులందరినీ చూసుకునే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా రెడీ అని చెప్పారు. నష్టపోయే వారిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా గౌరవిస్తానని హామీ ఇచ్చారు. కానీ.. చాలామంది ఎమ్మెల్సీలు మాత్రం ఇక తెరమరుగు కావటం ఖాయంగా కనిపిస్తుంది. అధికార పార్టీ టిడిపిపై కక్షతో తన రెండు కళ్లు పొడుచుకుందని... రాబోయే రోజుల్లో అన్ని ఎమ్మెల్సీ స్థానాలు వారికే వస్తాయనే విషయాన్ని మర్చిపోయిందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.