పతాక స్థాయికి చేరిన ఏపీ పొలిటికల్ గేమ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పతాక స్థాయికి చేరిన ఏపీ పొలిటికల్ గేమ్స్

విజయవాడ, జనవరి 25 (way2newstv.com)
శాసనమండలిపై రద్దు కత్తి వేలాడుతుంటే రాష్ట్రంలో రాజకీయం పతాకస్థాయికి చేరుకుంది. ఉరుమురిమి మంగళంపై పడ్డట్టు అధికార విపక్షాల రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యవస్థకు చరమగీతం పాడేందుకు రంగం సిద్దమవుతోంది. ఈవిషయంలో కేంద్ర, రాష్ట్రసంబంధాలు, రాజ్యాంగం, రాజకీయం, న్యాయమీమాంస లపై నెలకొన్న భిన్నాభిప్రాయాలు చర్చను రక్తి కట్టిస్తున్నాయి.ప్రజాప్రభుత్వ విధాన నిర్ణయాలకు అడ్డుపడుతోందనే సాకుతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేయాలని సూత్రప్రాయంగా సర్కారు నిర్ణయించినట్లుగా ప్రచారం జోరందుకుంది. ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం శాసనసభలో మండలి అవసరమా? అంటూ వ్యాఖ్యానించారు.
పతాక స్థాయికి చేరిన ఏపీ పొలిటికల్ గేమ్స్

శాసనమండలి తమకు అవసరం లేదంటూ తీర్మానించే అధికారం శాసనసభకు ఉంది. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మాత్రం భారత పార్లమెంటుదే. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్రశాసనసభ అభిప్రాయాన్ని కేంద్రం మన్నిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నం. అధికార, ప్రతిపక్షాలతో కేంద్రం , బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయనే భావన రాజకీయ వర్గాల్లో ఇప్పటికే వ్యాపించి ఉంది. ఒకవైపు బీజేపీ మూడు రాజధానులకు ససేమిరా అంటూ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తోంది. మరోవైపు కేంద్రం ఎక్కడా కనీస స్పందన కనబరచడం లేదు. ఈ పరిస్థితుల్లో శాసనమండలి రద్దుకు శాసనసభ తీర్మానం చేసి పంపితే కేంద్ర వైఖరి సైతం స్పష్టమవుతుంది. మూడు రాజధానుల విషయం కంటే ముందుగానే శాసనమండలి సంగతి చూడాలనుకుంటున్న రాష్ట్రప్రభుత్వ కోరికను కేంద్రం మన్నిస్తుందో లేదో తేలిపోతుంది. తక్షణం స్పందించి పార్లమెంటు లో రద్దు చట్టం ద్వారా మంగళం పాడితే వైసీపీ, బీజేపీల మధ్య సంబంధాలు ఆంతరంగికంగా సజావుగా ఉన్నట్లుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తనకున్న విచక్షణాధికారం ద్వారా తీర్మానాన్ని కోల్డ్ స్టోరేజీలో పెడితే రాష్ట్రంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న అంశం స్పష్టమవుతుంది. మూడు రాజధానుల విషయంలోనూ నేరుగా కాకున్న పరోక్షంగా తన అభిప్రాయం చెప్పేసినట్లవుతుంది.ఒకవేళ శాసనమండలి రద్దు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడితే న్యాయపరంగా జోక్యం చేసుకునే అధికారం ఉంటుందా? అనేది మరో ప్రశ్న. సాధారణ పరిస్థితుల్లో శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదు. అయితే అధికార పరిధులు, బాధ్యతలు వేరైనప్పటికీ శాసనమండలి అస్తిత్వంలో ఉన్నంతకాలం రాజ్యాంగం దృష్టిలో శాసనసభ, మండలి, గవర్నర్ కలిస్తేనే రాష్ట్రశాసనవ్యవస్థ అవుతుంది. న్యాయవ్యవస్థ సైతం మండలికి శాసనసభతో సమ ప్రతిపత్తి ఇస్తుంది. మూడు రాజధానుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చిన సందర్భంలోనూ ప్రభుత్వ న్యాయవాది మండలి బిల్లును సెలక్టు కమిటీకి పంపిందని చెప్పారు. అంటే రాజధానుల నిర్ణయంలో మండలి పాత్రను ప్రభుత్వం సైతం గుర్తిస్తోందని చెప్పాలి. పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి నోటిఫికేషన్ తో మండలి రద్దు అయితే ఫర్వాలేదు. అప్పుడు శాసనమండలితో అస్సలు పనిలేదు. అది జరగకపోతే మూడు రాజధానుల విషయంలో ముందుకు వెళ్లడం ప్రభుత్వానికి కష్టమే. సెలక్టు కమిటీ పరిశీలనలో ఉండగా అత్యవసర చట్టం తేవడాన్ని న్యాయస్థానం అంగీకరించకపోవచ్చు. గవర్నర్ సైతం తన విచక్షణాధికార పరిధిలో ప్రభుత్వం సిఫార్సును తిప్పి పంపే అవకాశాలుంటాయి. అందువల్ల శాసనమండలి విషయంలోనూ, మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ప్రభుత్వ నిర్ణయం సాఫీగా అమలవుతుంది.మండలి రద్దు, మూడు రాజధానుల అంశం రాజ్యాంగ , పాలన నిర్ణయంగా పైకి కనిపిస్తుంది. కానీ దానికంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ రాజకీయ నిర్ణయంగానే చూడాలి. గతంలో ఎన్టీరామారావు అధికారంలో ఉన్నప్పుడు 1983లోనే శాసనమండలి రద్దుకు శాసనసభ తీర్మానం చేసి పంపింది. ఇందిరాగాంధీ హయాంలో కేంద్రప్రభుత్వం పక్కనపెట్టేసింది. సుప్రీం కోర్టును ఆశ్రయించినా పనికాలేదు. 1985లో మరోసారి శాసనసభ తీర్మానం చేసింది. ప్రధానిగా రాజీవ్ గాంధీ దీనిని సమ్మతించి పార్లమెంటు చట్టం ద్వారా రద్దు చేయించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల ఇష్టాఅయిష్టాల మీద ఆధారపడి నిర్ణయాలు అమలవుతున్నట్లు మనకు స్పష్టం అవుతోంది. మళ్లీ 2007లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వాలున్నప్పుడు వై.ఎస్. హయాంలో అస్తిత్వంలోకి వచ్చింది. అందువల్ల ముందుగా కేంద్రంతో లాబీయింగ్ చేసుకున్న తర్వాతనే రద్దు వంటి నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రప్రభుత్వానికి మంచిది. లేకపోతే ఇప్పటికే మండలిలో కొంత భంగపాటుకు గురైన స్థితి. రద్దు తీర్మానం చేసినా కేంద్రం పట్టించుకోకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. మండలి రద్దు ప్రతిపాదన ను కేంద్రంలోని పొలిటికల్ అఫయిర్స్ కేబినెట్ కమిటీ, పార్లమెంటరీ అఫయిర్స్ కమిటీ చర్చించి కేంద్రమంత్రిమండలికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ఒత్తిడి తెస్తే తప్ప బడ్జెట్ వంటి కీలక సందర్బాల్లో ఇటువంటి రాష్ట్ర చట్టాలపై దృష్టి పెట్టడం కేంద్రానికి సాధ్యం కాదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉండే రాజకీయ సంబంధాలే శాసనమండలి భవితవ్యాన్ని నిర్దేశిస్తాయి.