కేంద్ర బడ్జెట్ ఆధారంగా తెలంగాణ బడ్జెట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్ర బడ్జెట్ ఆధారంగా తెలంగాణ బడ్జెట్

హైద్రాబాద్, జనవరి 31, (way2newstv.com)
తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఆర్థిక మాంద్యం, రెవెన్యూ వసూళ్ల తీరుతెన్నులు ఆశాజనకంగా లేకపోవడం తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు, పన్నుల ఆదాయం తదితర అంశాలు, వివిధ రంగాలకు ఇచ్చే ప్రాధాన్యతలు, ఆర్థిక నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరులోపల వివిధ శాఖలు బడ్జెట్ అంచనాలను ఆన్‌లైన్‌లో పంపాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్‌రావు ప్రవేశపెట్టనున్నారు. 
కేంద్ర బడ్జెట్ ఆధారంగా తెలంగాణ బడ్జెట్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అప్పట్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 2019 ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. అనంతరం ఏడు నెలల తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే.ఈ నెలాఖరు లోపల వివిధ శాఖల నుంచి వచ్చే సవరించిన బడ్జెట్ అంచనాలను పరిగణనలోకి తీసుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమగ్ర నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు పంపుతారు. అనంతరం ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో కలిసి బడ్జెట్‌ను ఖరారు చేస్తారు. అనవసరమైన వాటిని చేర్చకుండా, సంక్షేమ రంగంలో రాజీపడకుండా వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిధుల అవసరంపై బడ్జెట్ అంచనాలను తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం వివిధ శాఖలకు గట్టి సంకేతాలను పంపింది. జాతీయ స్థాయిలో జీడీపీ తగ్గింది. నిరుద్యోగం పెరిగినట్లు ఇప్పటికే వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో నెలకొన్న అశాంతిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం సమర్పించే బడ్జెట్ కోసం రాష్ట్రప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం రూ.1.82 లక్షల కోట్లకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం సెప్టెంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లకు ఈ బడ్జెట్‌ను కుదించింది. అనంతరం రూ.36 వేల కోట్లను కుదించింది. ఈ విషయమై అప్పట్లో విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మాంద్యం దేశవ్యాప్తంగా నెలకొన్న విషయాన్ని ముందుగానే ప్రకటించారు. దీని ప్రభావం వల్ల జాతీయ స్థాయిలో ఆర్థిక రంగంలో నెలకొన్న పరిస్థితిని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ అసెంబ్లీలో రూ.36 వేల కోట్ల బడ్జెట్‌ను కుదించేందుకు దారితీసిన కారణాలను కూలంకషంగా వివరించారు. ఈసారి కూడా అటుఇటుగా రూ.1.50 లక్షల కోట్లలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.దాదాపు రూ.10 వేల కోట్ల నిధులను ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం భావించినా, అందుకు తగిన మార్కెట్ లేకపోవడంతో ఈ విషయంలో తగిన పురోగతి సాధించలేకపోయింది. రైతుబంధు కింద రూ.5,100 కోట్లను విడుదల చేసి, ఇందులో మొదటి విడత కింద రూ.3,100 కోట్లను మంజూరు చేసి అర్హులకు పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఈ నిధులను అర్హులైన రైతులకు పంపిణీ చేయనున్నారు. మార్కె ట్ నుంచి రూ.27 వేల కోట్లరుణాలు తెచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద 3.25 శాతం వరకు పరిమితులు ఉన్నందువల్ల మరో రూ.6 వేల కోట్ల నిధులు సేకరించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్ విధి విధానాలను చూసిన తర్వాత అవసరమైతే బడ్జెట్ కేటాయింపుల్లో చివరి నిమిషంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్థిలో రాజీపడకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి