ఏలూరు, జనవరి 30, (way2newstv.com)
పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు. ఆయన పేరుకు ముందు పవర్ స్టార్ అన్న ట్యాగ్ కూడా ఉంటుంది. అది వెండితెర మీద మాత్రమే. రాజకీయ తెర మీద మాత్రం ఆయన ఒక్క హీరో తప్ప అన్ని పాత్రలూ పోషిస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి. లేకపోతే 151 మంది ఎమ్మెల్యలతో బలంగా ఉన్న వైసీపీ సర్కార్ని కూలుస్తానని శపధం చేయడమేంటి. ఆయనకు పేరుకు చెప్పుకోవడానికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా జగన్ కి జై కొడుతున్న వేళ పవన్ వెర్రి ఆవేశంతో ఇస్తున్న ప్రకటనలు జనంలో మరింతగా పలుచన చేస్తున్నాయిబీజేపీ కేంద్రంలో ఉంది. తలచుకుంటే ఏపీ సర్కాని కూలదోస్తుందని పవన్ సినిమాటిక్ గా ఆలోచనలు చేస్తున్నట్లున్నారు. కానీ ఆయనకు ఇంకా రాజకీయాలు వంటబట్టినట్లుగా లేవని అంటున్నారు.
పవన్ ఉత్సాహం వెనుక....
బీజేపీ ఎందుకు జగన్ ని రోడ్డు మీదకు తెస్తుంది. ఎందుకు ఆయన సర్కార్ ని కూలగొడుతుంది. నిజంగా చేద్దామనుకున్నా బీజేపీకి ఇపుడు దేశంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా. కర్నాటక, మహారాష్ట్రల అనుభవాలతో తలబొప్పికట్టిన బీజేపీకి ఇంత సీన్ ఎక్కడిది. రాజకీయం ఎరిగిన వారికి ఇది బాగా అర్ధమవుతుంది. కానీ పవన్ మాత్రం బీజేపీ ఉంటే చాలు జగన్ అవుట్ అనుకుంటున్నారు.ఇక ఏపీలో బీజేపీకి ఆశాకిరణం పవన్ కల్యాణ్ కాదు, కచ్చితంగా జగనే. ఈ సంగతి తెలియకే పవన్ రాజకీయంగా ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలలో నచ్చినది ఎన్నుకోమంటే వైసీపీనే బీజేపీ ఎంచుకుంటుంది. దానికి కారణం చంద్రబాబు జిత్తులమారి రాజకీయాన్ని గత అయిదేళ్ళలో మోడీ, షా స్వయంగా చూశారు కాబట్టి. సందు దొరికితే చాలు జాతీయ స్థాయిలో రెచ్చిపోవడానికి బాబు రెడీ. కానీ ఆయనకు ఏపీలో గుండు సున్నాగా ఉంది. జగన్ ని ఏ మాత్రం కదిపినా భారీ ఫలితం పొందేది చంద్రబాబే. అందువల్ల జగన్ని దెబ్బతీసి బాబుకు రాచబాట వేసి చివరికి తమ నెత్తిన ఆ కొరివి పెట్టుకోవడానికి బీజేపీ సిధ్ధంగా ఉంటుందా. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడూ ఈ పని చేయడు. ఇంత సింపుల్ రాజకీయం పవన్ కల్యాణ్ కి తెలియకపోవడం వల్లనే ఆయన అలా పార్టీ నేతగానే మిగిలిపోతున్నారని అంటున్నారు.నిజానికి సౌత్ లో బీజేపీకి కర్ణాటక తరువాత ఏపీలో పెద్ద కాపు జగనే. ఆయన పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. రేపో మాపో ఆరుగురు రాజ్యసభ సభ్యులు వస్తారు. ఇక జగన్ కి అపరిమితమైన జనాదరణ ఉంది. పైగా ఆయనకు సంక్షేమ పధకాలే శ్రీరామ రక్షగా ఉన్నాయి. జగన్ని కదిపితే మళ్ళీ ఆయన మొత్తం 175 సీట్లను గెలుచుకుని సీఎంగా వస్తారు. ఆ సంగతి కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. అంతే కాదు, కేంద్రంలోనూ పునాదులు కదులుతాయి. అందువల్ల జగన్ ని మంచి చేసుకుని ఆయన మద్దతుని పార్లమెంట్ లో తీసుకోవడమే బీజేపీకి రాజకీయ అవసరం. ఇక జగన్ కి కూడా కేంద్రం అండ కావాలి. ఇలా బయటకు తెలియని పరస్పర అవగాహన ఇద్దరి మధ్యన ఉందని రాజకీయాల్లో తలపండిన వారు చెబుతారు. ఏమీ తెలియకపోవడం వల్లనే పవన్ కూల్చేస్తాను అంటూ భారీ స్టేట్మెంట్లు ఇస్తూ అభాసుపాలవుతున్నారని అంటున్నారు. ఇది పవన్ చేస్తున్న పొలిటికల్ కామెడీ అంటున్నారు.