హైద్రాబాద్, జనవరి 27,(way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పని అయిపొయింది. వయోభారం అనారోగ్య సమస్యలతో ఆయన విధులు నిర్వర్తించలేక పోతున్నారు. నెక్స్ట్ బాస్ పార్టీకి కేటీఆర్. సో ఆయనకు ముందే గాలి కొట్టేస్తే పోలా. అనుకున్న మంత్రులనుంచి కింది స్థాయి వరకు కాబోయే సిఎం కేటీఆర్ అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. తమ బెర్త్ లు కాపాడుకునేందుకు కొందరు అందలం ఎక్కుదామని మరికొందరు ముందస్తు భజనలతో రేపోమాపో కేటీఆర్ కారు స్టీరింగ్ తిప్పేస్తారనే అంతా లెక్కేశారు.మునిసిపల్ ఎన్నికల్లో ఘన విజయంతో టి సిఎం కేసీఆర్ మంచి జోష్ మీదకు వచ్చారు. వెంటనే మీడియా ముందుకు వచ్చి మంచి చెడ్డా ముచ్చట పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాను హెల్త్ చెక్ అప్ కి వెళితే తన పని అయిపోయిందని మీడియా లో వచ్చిన ప్రచారం పై వివరణ ఇచ్చేశారు.
పట్టాభిషేకానికి టైముందే
దుక్కలా ఉన్నావని వైద్యులు సర్టిఫై చేశారని ప్రస్తుతం ప్రజల్లో సైతం తనపై వ్యతిరేకత ఏమీ లేదని చెబుతూ ఉత్సహంగా పదవిలో ఉండబోతున్నట్లు పరోక్షంగా చెప్పేశారు.అలాగే కేంద్ర రాజకీయాలవైపు వెళతాను అనే ప్రచారాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రిగానే కొనసాగనున్నట్లు తేల్చేశారు. తాను తెలంగాణ ప్రజలకు ఇంకా సేవ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తనను తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, వారి ఆశీస్సులే తన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని చెప్పారు. దాంతో గులాబీ పార్టీలో అంతర్గతంగా ముఖ్యమంత్రి మారుతారన్న ప్రచారానికి పూర్తిగా తెరపడింది. అదే విధంగా తెలంగాణ లో ఈ వ్యవహారాలపై నిత్యం నడుస్తున్న ఊహాగానాలకు తెరదించేశారు గులాబీ బాస్.రాజకీయ వ్యూహాలు రచించడం వాటిని పక్కాగా అమలు చేయడంలో కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. అతి తక్కువ సందర్భాల్లోనే ఆయన రాజకీయ వ్యూహాలు బెడిసి కొట్టాయి. భారీ బహిరంగ సభలు లేకుండా, ముఖ్యమంత్రి ప్రచారం సైతం చేయకుండానే కేసీఆర్ అపూర్వ విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపు వెనుక అనేక కారణాలే కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఇంటిటింటికి క్యాడర్ ద్వారా చేరవేయడం ఒక పాయింట్. అలాగే పూర్తిగా స్థానిక నాయకత్వానికి గెలుపు బాధ్యతలను అప్పగించి వారిపై పూర్తి విశ్వాసాన్ని పెట్టింది అధిష్టానం. గెలుపు గుర్రాలను గుర్తించి టికెట్లు ఇవ్వడంలో కూడా స్థానిక నాయకత్వాలు సక్సెస్ అయ్యాయి. దీనికి తోడు సాగునీటి ప్రాజెక్ట్ లు, సంక్షేమ పథకాలు గులాబీ పార్టీకి దీవెనల అంశంలో బాగా దోహదపడ్డాయి. మునిసిపల్ ఎన్నికలకు కేసీఆర్ పక్కాగా సిద్ధం అయ్యారు. విపక్షాలు మాత్రం ఆధిపత్యం కోసం టికెట్ల కోసం కొట్లాటల తో సమయం సరిపోయింది. అదేవిధంగా అటు కాంగ్రెస్ కి కానీ, బిజెపికి కానీ తమదైన వ్యూహాలు లేకపోవడం తో పాటు వారు గెలిచినా తమ ప్రాంతానికి నష్టమే తప్ప లాభం లేదన్న ప్రజల అనుమానం కొంప ముంచాయి అని తేలింది. నిత్యం అధికారపక్షాన్ని విమర్శలు చేయడం తప్ప తాము చేయబోయే కార్యక్రమాలను విపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైఫల్యం కూడా పరాజయానికి కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు విశ్లేషకులు.