విజయవాడ, జనవరి 10, (way2newstv.com)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి తో జతకలుస్తారన్న ప్రచారం ఇప్పుడు ఆయన చర్యలతో మరింత ఊపందుకుంది. గత కొంత కాలంగా మోడీ, షా లపై జనసేనాని ప్రశంసలు కురిపించడం, ఢిల్లీ లో కాషాయనేతలను రహస్యంగా కలుస్తున్నారన్న వరకు గట్టి ప్రచారం సాగింది. తాజాగా పవన్ కల్యాణ్ ను బిజెపి కి చెందిన కర్ణాటక యువ ఎంపీలు కలవడం ఆయనతో సుదీర్ఘంగా భేటీ కావడం మరోసారి కొత్త చర్చకు దారితీసింది. కమలం పార్టీ వ్యూహాత్మకంగా వీరిద్దరిని పంపిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. అయితే యువ ఎంపీలు ఇద్దరు ఈ అంశాన్ని ఖండిస్తుండటం మరో విశేషం.
కమలం నేతలతో పవన్ రహస్యభేటీలు
జనసేన పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణాదిన కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అందులో ముఖ్యంగా కర్ణాటక లో కూడా పవర్ స్టార్ కి అభిమానులు ఎక్కువే. ఇప్పుడు దీన్నే సాకుగా చూపిస్తున్నారు బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్య, మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ. తాము ఎప్పటినుంచో పవన్ కల్యాణ్ అభిమానులమంటూ అందుకే ఆయన్ను కలిశామని వీరు చెప్పడం విడ్డురం అంటున్నారు విశ్లేషకులు.వాస్తవానికి ఎమ్యెల్యే స్థాయి లో ఉండేవారికి క్షణం తీరిక ఉండని షెడ్యూల్ నడుస్తుంది. ఇక ఎంపి లు మరింత బిజీ గా వుంటారు. అయితే ఈ యువ ఎంపీలు ఇద్దరు ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ తో భేటీ కావడం సెల్ఫీ కోసమా అంటే కాదనే టాక్ సాగుతుంది. రాబోయే రోజుల్లో బిజెపి తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వ్యూహాలతో సాగడానికి సిద్ధం అవుతుంది. అందులో భాగంగా జనసేన సహకారం కమలంతో దోస్తీ టీ గ్లాస్ కి చాలా అవసరం. ఆ దిశగా త్వరగా అడుగులు వేసేందుకే ఈ ప్రయత్నం అన్నట్లు తెలుస్తుంది. చూడాలి త్వరలో ఏం జరగనుందో.
Tags:
political news