నెల్లూరు, జనవరి 23, (way2newstv.com)
ఏడు నెలలు కాలేదు. అప్పుడే అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు బహిరంగంగానే పార్టీపైనా, అధినేతపైనా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పదవులు రాలేదని కొందరు, పార్టీలో తనకు ప్రయారిటీ లేదని మరికొందరు బరస్ట్ అవుతుండటంతో పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఒకరు తర్వాత మరొకరు ఇలా ముఖ్యమంత్రి జగన్ కు తలనొప్పిగా మారారు.నెల్లూరు జిల్లాలో గ్రూపు విభేదాలున్నాయని అధినేత జగన్ కు తెలుసు. ఎప్పటికప్పుడు ఆయన ఆ జిల్లా పరిస్థిితిపై నివేదికలను తెప్పించుకుంటున్నారు. గత ఎన్నికల్లో అన్ని స్థానాలను ఇచ్చిన జిల్లా కావడంతో జగన్ సయితం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు.
తొలినాళ్లలో హోంమంత్రి మేకతోటి సుచరితను జిల్లా ఇన్ ఛార్జిగా నియమించినా పరిస్థితిలో మార్పు కనకపోవడంతో ఇన్ ఛార్జిగా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిని నియమించారు. అయినా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే బాలినేని కూడా నేతలను సమన్వయం చేయడంలో ఫెయిల్ అయినట్లేనని చెప్పాలి.తొలుత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ పై మీడియా సమావేశం పెట్టి మరీ ఫైరయ్యారు. నెల్లూరు జిల్లాలో అనేక మాఫియాలున్నారని, కొందరు నేతలు వీరి వెనక ఉన్నారని చెప్పారు. ఇది సంచలనం కావడంతో జగన్ ఒక దశలో ఆనంకు షోకాజ్ నోటీసు ఇవ్వాలనుకున్నారు. కానీ ఆనం రామనారాయణరెడ్డి జగన్ ను కలసి వివరణ ఇవ్వడంతో కొంత సద్దుమణిగింది. ఇక తాజాగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన కంటే వెనక వచ్చిన వాళ్లకే పదవులు దక్కుతున్నాయని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా శాసనసభలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. తనకు శాసనసభలో మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. పైగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని కూడా ఈ వివాదంలోకి లాగారు. జగన్ తనకు అధినేత అంటూనే పార్టీపై నెగిటివ్ కామెంట్స్ చేయడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. నిజానికి అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మాట్లాడాలని కోటంరెడ్డికి స్పీకర్ అవకాశమిచ్చారు. కానీ అది కాకుండా పార్టీ నేతలపై విమర్శలు చేయడంపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.