విజయవాడ, ఆగస్టు 26 (way2newstv.com)
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశావర్కర్ల వేతనాలు రూ. 10 వేలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారికి పెండింగ్ వేతన బకాయిలను చెల్లించడం మరి చింది. గత 7 నెలలుగా వేతనాలు అందక ఆశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెంచిన వేతనాలను ఆగస్టు నెల నుంచి అమలు చేస్తామని చెప్పినప్పటికీ... అసలు తమకు రావాల్సిన బకాయిలే పెండింగ్‌లో ఉండటంతో వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 39,609, పట్టణాల్లో 2,744 మంది కలిపి మొత్తం 42,353 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా పలు ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడం, ఇంటింటికీ తిరిగి గర్భిణీలు, బాలింతలు, ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యం పై అవగాహన కల్పిస్తూ వారు ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ సెంటర్లకు వెళ్లేలా సూచిస్తూ మాతాశిశు మరణాల తగ్గుదలలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఆశా వర్కర్లు భారీ ఆందోళన
వాటితోపాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, పలు వ్యాధులపై అవగాహన కల్పించడం, ప్రతి ఇంటికీ తిరిగి వ్యాధుల వివరాలు నమోదు చేయడం వంటి జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగమైన పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. వాటితోపాటు పారిశుధ్యం, పోషకాహారం, వ్యాధుల నివారణ వంటి ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, సంచార చికిత్స (104)లో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశాలకు నెలకు రూ.3 వేలు గౌరవవేతనం, రూ. 5,600 వరకు పారితోషకాలను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు వారు పెరిగిన వేతనాన్ని అందుకోలేదు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలు రూ.10 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే అవన్నీ పారితోషకాలతో కలిపే అని స్పష్టం చేయడంతో ఆశా వర్కర్లు నిరాశ చెందారు. తమకు పారితోషికాలతో సంబంధంలేకుండా నెలకు రూ.10 వేలు వేతనమివ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు వారి వేతన పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఉత్తర్వులు కూడా జారీ చేయకపోవడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
Tags:
Andrapradeshnews