నెల్లూరు, ఆగస్టు 21, (way2newstv.com)
పార్టీ అధికారంలోకి వచ్చి 75 రోజులే అయింది. ఇంతలోనే అనేక విమర్శలు వైసీపీని చుట్టుముట్టాయి. ముఖ్యంగా ప్రతిపక్షానికి అస్త్రాలు ఇవ్వకుండా చూసుకోవడంలోను, పాలనా మేనేజ్‌మెంట్‌లోనూ వైసీపీ దూకుడు ప్రదర్శించడం లేదనే ప్రధాన విమర్శ వైసీపీ అభిమానుల నుంచి, మేధావుల నుంచి కూడా వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. తొలి మాసం బాగానే ఉందని అనుకున్నా.. పాలన ప్రారంభించిన తర్వాత రెండో నెలలో జగన్‌కు ఊపిరి సలపనంతగా విమర్శలు ఒకదానిపై ఒకటి వస్తున్నాయి. ఆయన మంత్రి వర్గాన్నిఎన్నో ఆశలతో ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలోను, జగన్ తరఫున బలమైన వాయిస్ వినిపించడంలోనూ వీరిలో ఒక్క బొత్స తప్ప ఎవరూ ముందుకురావడం లేదు.
వైసీపీలో ఆ ఇద్దరదే వాయిస్
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నా.. ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇసుక ఆగిపోవడంతో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచిఒత్తిడులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మీడియా అమరావతి, పోలవరం ప్రాజెక్టులు నిలిచిపోవడాన్ని దేశ ప్రగతి ఆగిపోయిన చందంగా చూపిస్తోంది. అదేసమయంలో వాటిలో అవినీతి ఏరులై పారిందని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ అవినీతి మాటేంటో ఇప్పటి వరకు వెల్లడించక పోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కారణమైంది. అదేసమయంలో ఒకింత పారదర్శకంగానే నడుస్తున్న అన్నా క్యాంటీన్లను కూడా జగన్ ప్రభుత్వం నిలిపి వేయడం పుండుపై కారం చల్లినట్టుగా యాగీ చేసే పరిస్థితి కల్పించింది.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిపించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేయడం మరింత దుమారం రేపింది. ఇక, జనసేన ఎమ్మెల్యే రాపాక ను పోలీసులు దూషించడం కూడా ఎస్సీ వర్గాల్లో చర్చకు కారణమైంది. నిజంగానే ఒక ఎమ్మెల్యేని ఎస్సై స్థాయి అధికారి బ్లాంక్‌లో షూట్ చేస్తానని అనడం, పరుషంగా దూషించడం నిజమే అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున వినిపించలేక పోయారు. దీనిని అదును గా తీసుకున్న జనసేన అధినేత పవన్ రెచ్చిపోతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఆయన అపహాస్యం చేసేలా వ్యాఖ్యానిస్తున్నా.. వైసీపీ తరఫున ఏ ఒక్కరూ పవన్ వ్యాఖ్యలను ఖండించడం లేదు.మరోపక్క, చంద్రబాబు నివాసాన్నిఖాళీ చేయిస్తాననే పట్టుదలతో ఉన్న జగన్.. కృష్ణా నీటిని సరైన సమయంలో విడుదల చేయలేదనే అపవాదు కూడా వస్తోంది. ఆయా విషయాలపై యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన వైసీపీ యంత్రాంగం మీన మేషాలు లెక్కిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల మహోగ్రరూపంతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వేలాది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలోనేసీఎంగా ఉన్న జగన్ సొంత పనులపై విదేశీ యాత్రకు వెళ్లడాన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఏదేమైనా.. విషయాలు చిన్నవా పెద్దవా అనేది పక్కన పెడితే.. వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన తరుణంలో వైసీపీ చేతులెత్తేసిన విధంగా వ్యవహరిస్తోందని అభిమానులే ఉసూరు మంటున్నారు. మరి దీనిని ఇప్పటికైనా చక్కదిద్దే ప్రయత్నాలు సాగుతాయో లేదో చూడాలి.
Tags:
Andrapradeshnews