కొత్త సర్పంచ్ ల పన్ను వసూళ్ల టాస్క్

 నల్గొండ, ఫిబ్రవరి 7,(way2newstv.com)
కొత్త  సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన గ్రామ ప్రజా ప్రతినిధులకు పన్నుల వసూళ్ళ ప్రక్రియ కీలకంగా మారింది. పంచాయతీల్లో పన్నులు వసూళ్ళలో ఎంత వేగం పెరిగితే అంతగా అభివృద్ధి పనులు జరుగుతాయని ఇప్పటికే వారికి ఒక స్పష్టత వచ్చింది. అందుకే బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్‌లు తొలుత ఈ అంశంపైనే దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు జరగడంతో చాలా చోట్ల ఆస్తిపన్ను వసూలు పూర్తిస్థాయిలో జరగలేదు. చిన్న పంచాయతీల్లో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అందుకే ఆస్తిపన్నును వంద శాతం వసూలు చేయడంపై దృష్టి పెట్టారు.


 కొత్త సర్పంచ్ ల పన్ను వసూళ్ల టాస్క్

పంచాయతీల్లో ఇంకా వసూలు కావాల్సిన ఆస్తిపన్ను ఎంత, రానున్న ఆర్ధిక సంవత్సరంలో ఎంత వసూలు చేయడానికి అవకాశముంది, పంచాయతీల్లో భవన నిర్మాణ అనుమతుల్లో వస్తున్న ఆదాయం ఎంత, అనుమతుల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయా, ఆస్తిపన్ను కట్టకుండా తప్పించుకుంటున్నవారు ఎంత మంది, విలువను తక్కువగా చూపించి పన్ను చెల్లిస్తున్న వారు ఎంత మంది తదితర అంశాలపై సర్పంచ్‌లు ఆరా తీస్తున్నారు. బకాయిలు లేకుండా పన్నుల్ని సకాలంలో, క్రమం తప్పకుండా చెల్లించేవారికి అవసరమైతే చిరు ప్రొత్సహకాలను అందించాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరిధిలో ఈ విధానం విజయవంతంగా అమలవుతోంది. ఆర్ధిక సంవత్సరం మొదలైన తొలి మాసంలోనే ఆస్తిపన్నును మొత్తం చెల్లించేవారికి ఐదు శాతం రిబేటు కల్పిస్తోంది. దీని వల్ల ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలలోనే గ్రేటర్ బల్దియాకు పెద్దఎత్తున ఆదాయం లభిస్తోంది.అభివృద్ధి పనులకు నిధుల సమస్య తప్పింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనున్నందున వసూలు కావాల్సిన మొత్తం ఆస్తి పన్నుపై కొత్త సర్పంచ్‌లు వివరాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 300 జనాభా ఉన్న గ్రామాలతో పాటు గిరిజన గూడేలు, తండాల్లో వెలుగులు నింపాలన్న లక్షంలో అతి తక్కువ జనాభా ఉన్న గ్రామాలను సైతం పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి నిధులను కూడా విడుదల చేయనున్నట్లు హామీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించింది. ఒక్కో పంచాయితీ ఐదు లక్షల రూపాయల మొదలు పది లక్షల వరకు ఆర్థిక కేటాయింపులు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినందున రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
Previous Post Next Post