Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం

May 24, 2019

విజయవాడ, మే 24, (way2newstv.com
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమయింది. ఈ నెల 30న జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రేపు వైసీపీ శాసనసభా పక్షం సమావేశమై జగన్ ను తమ నేతగా ఎన్నుకుంటారనీ, అనంతరం తామంతా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కాగా, జగన్ ప్రమాణస్వీకార వేదికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని జగన్ భావించారు. అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుందని అధికారులు సూచించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం విజయవాడలోని చినఅవుటపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.ప్రమాణస్వీకార కార్యక్రమానికి కనీసం 5 నుంచి 7 లక్షల మంది హాజరు అవుతారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 


30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం
ఈ నేపథ్యంలో కనీసం 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయాలని జగన్ వైసీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం.జగన్ తో అధికారుల భేటీ వైసీపీ అధినేత, ఏపీ కాబోయే సీఎం జగన్ నివాసం వద్ద భారీ కోలాహలం కనిపిస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఈ ఉదయం 23 ప్రభుత్వ శాఖలకు చెందిన 57 మంది అధికారులు తరలివెళ్లారు. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారు. జగన్ ను మర్యాదపూర్వకంగా పలకరించిన అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వివరాలను జగన్ కు అందజేశారు. జగన్ అందరు అధికారులతో సావధానంగా మాట్లాడారు.కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటినుంచి జగన్ క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఆయనను కలిసి విషెస్ చెప్పేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. అందరినీ కలుస్తూ, అభినందనలు స్వీకరిస్తూ జగన్ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆయన ఈనెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.అమరావతిలో నేమ్ ప్లేట్స్ తొలగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. నిన్న చంద్రబాబు రాజీనామాతో, టీడీపీ ప్రభుత్వం రద్దు కాగా, సచివాలయంలోని మంత్రుల చాంబర్ల ముందున్న నేమ్ ప్లేట్స్, చాంబర్లలోని చంద్రబాబు ఫోటోలను తొలగించాలని సాధారణ పరిపాలనా శాఖ ఆదేశించింది. దీంతో అధికారులు వాటిని తొలగించే పనులను నేడు ప్రారంభించారు. జీఏడీ ఆదేశాలతో అన్ని గదుల ముందున్న నేమ్ ప్లేట్స్, చంద్రబాబు, ఎన్టీఆర్ ల చిత్ర పటాలను తొలగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతనూతనంగా వచ్చే మంత్రుల పేర్లతో నేమ్ ప్లేట్స్ రాయిస్తామని అధికారులు వెల్లడించారు. కోలాహలంగా జగన్ నివాసం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇంటివద్ద కోలాహలం నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన నివాస గృహానికి నాయకులు, అధికారులు క్యూ కడుతున్నారు. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అధినేతను కలిసి అభినందనలు అందజేస్తున్నారు. జగన్‌ను కలిసిన వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు పార్టీ ప్రతినిధులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక అధికారుల రాకతో జగన్‌ నివాసం వద్ద సందడి నెలకొంది. టీటీడీ ఈవో, వేదపండితులు కలిసి వేదాశీర్వచనం అందించారు.స్పెషల్ ఆఫీసర్ గా జోషి రాష్ట్రంలో అఖండ విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భద్రత కోసం ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈనెల 30వ తేదీన జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అమర్లపూడి జోషిని పోలీసు శాఖ నియమించింది. దీంతో జోషి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.
Read More

30న మోడీ ప్రమాణం

May 24, 2019
న్యూఢిల్లీ మే 24, (way2newstv.com)

న‌రేంద్ర మోదీ రెండ‌వ‌సారి ప్ర‌ధానిగా ఈనెల 30వ తేదీన ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలు ఉన్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి భారీ మెజారిటీతో విజ‌య‌దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సుమారు 4 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మోదీ... ఈనెల 28వ తేదీన అక్క‌డ‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. 


30న మోడీ ప్రమాణం
స్వంత రాష్ట్రం గుజ‌రాత్‌కు కూడా ఈనెల 29న మోదీ వెళ్తార‌న్న స‌మాచారం వినిపిస్తున్న‌ది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నరేంద్ర మోదీ సాయంత్రం కలిశారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కోవింద్‌తో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాను రాష్ట్రపతికి మోదీ సమర్పించారు. మోదీ రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353, యూపీఏకు 92 స్థానాలు రాగా, ఇతరులు 97 స్థానాల్లో గెలుపొందారు. 2014లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 స్థానాలు రావడంతో.. రెండోసారి మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Read More

ఫిరాయింపుదారులకు అవకాశం లేదు

May 24, 2019

గుంటూరు, మే 24  (way2newstv.com)
ఒక పార్టీ నుంచి గెలిచి అధికారం కోసం మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా, జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఈ ఫిరాయింపులను పెద్ద ఘనకార్యంగా చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఎటువంటి లబ్ధిని ఆశించారో కానీ 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పోతూపోతూ తాము గెలిచిన పార్టీని, గెలిపించిన అధినేత జగన్ ను సైతం విమర్శించి పోయారు. ఇలా టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు తర్వాత మరణించారు. 


ఫిరాయింపుదారులకు అవకాశం లేదు
నలుగురు మంత్రులయ్యారు.గత ఎన్నికల్లో ఫిరాయించిన 21 మందిలో 16 మందికి తెలుగుదేశం పార్టీ మరోసారి టిక్కెట్లు ఇచ్చింది. వీరికి ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడాన్ని ప్రజలు హర్షించలేదు. టిక్కెట్లు దక్కించుకున్న వారిలో కేవలం ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గొట్టిపాటి రవి ఒక్కరే విజయం సాధించారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దారుణంగా ఓడిపోయారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురు సైతం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గాల్లో బలమైన వారిగా గుర్తింపు ఉన్న వారు సైతం ఇప్పుడు ఓడిపోయారు. టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవులు దక్కించుకున్న అమర్ నాథ్ రెడ్డి పలమనేరులో, భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ సుజయకృష్ణా రంగారావు బొబ్బిలిలో, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ స్థానంలో ఓడిపోయారు.ఇక, పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, కలమట వెంకటరమణ, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పన, జ్యోతుల నెహ్రూ, ముత్తముల అశోక్ రెడ్డి తదితరులు సైతం దారుణంగా ఓడిపోయారు. ఈ స్థానాల్లో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే ప్రజలు మళ్లీ గెలిపించారు. ప్రజల తీర్పును గమనిస్తే చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వకపోతే మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, డేవిడ్ రాజు, పరుపుల సుబ్బారావు వంటి వారు చివరికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు..
Read More

జగన్ కు పెరిగిన సెక్యూరిటీ

May 24, 2019

అమరావతి, మే 24   (way2newstv.com)
జగన్ కు వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఆరు వాహనాల కాన్వాయ్ ని 'ఏపీ 18పీ 3418' నంబర్ తో అధికారులు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను స్వయంగా చేతుల్లోకి తీసుకుంది.


జగన్ కు పెరిగిన సెక్యూరిటీ

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసాన్ని, దాన్ని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. జగన్ ఇంటికి దారితీసే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేసి, ఆ రూట్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధించారు. వైఎస్ జగన్ కాబోయే ముఖ్యమంత్రి కావడంతో, నిబంధనల మేరకు భద్రతను పెంచామని ఉన్నతాధికారులు అంటున్నారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమావేశమై, రాష్ట్ర పరిస్థితులను సమీక్షించనున్నారు. చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు. ఆపై వైసీపీ తరఫున గెలిచిన అభ్యర్థులతోనూ జగన్ సమావేశం కానున్నారు.
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో విజయ పతాకాన్ని ఎగురవేసి, అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటి, దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేల తరువాత అత్యధిక స్థానాలను గెలిచిన పార్టీగా నిలిచింది. దేశవ్యాప్తంగా 542 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి కాగా, బీజేపీకి 303, కాంగ్రెస్ కు 52, డీఎంకేకు 36 స్థానాలు లభించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 22 సీట్ల చొప్పున గెలిచి, నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి తరువాత శివసేన 18, జేడీ (యూ) 16, బీజేడీ 12, బీఎస్పీ 10, టీఆర్ఎస్ 9, సమాజ్ వాదీ 5, ఎన్సీపీ 4 స్థానాలతో నిలిచాయి. మిగతా సీట్లను టీడీపీ, అన్నా డీఎంకే సీపీఐ సహా ఇతరులు దక్కించుకున్నారు
Read More

సిక్కోలులోక్షణక్షణం తీవ్ర ఉత్కంఠ

May 24, 2019

శ్రీకాకుళం, మే 24   (way2newstv.com)
తీవ్ర ఉత్కంఠ మధ్య శ్రీకాకుళం పార్లమెంటు ఎన్నిక తుది ఫలితం ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉదయం మొదలైన లెక్కింపు ప్రక్రియ శుక్రవారం తెల్లవారుజాము వరకూ కొనసాగింది. క్షణక్షణం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ స్థానంలో లెక్కింపు ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యాహ్నం వరకూ వెనుకంజలో ఉన్న టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు అనూహ్యంగా ఆధిక్యతలోకి వచ్చారు. ఈవీఎంలలో అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు 8,222 ఓట్ల ఆధిక్యతలో నిలిచారు. అదే సమయంలో 7వేలు సర్వీసు ఓట్లు, 14వేలు పోస్టల్ బ్యాలెట్లు మిగిలి ఉండడంతో ఉత్కంఠ పెరిగింది. సిక్కోలులోక్షణక్షణం తీవ్ర ఉత్కంఠ
కానీ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనర్హత ఓట్లను అధికారులు తొలగించారు. దీనిపై వైసీపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటన్నింటినీ లెక్కించాలని కోరారు. అర్ధరాత్రి వరకూ తుది ఫలితం రాలేదు. ఒకదశలో లోపల వారిని బయటికి రానీయకుండా... బయటవారిని లోపలికి వెళ్లకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టం చేశారు. సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 12గంటలకు పూర్తికాగా, రామ్మోహన్ నాయుడు 6808 ఓట్ల ఆధిక్యత సాధించారు. అయితే, వైసీపీ అభ్యర్థి పలు అభ్యర్థనలు లేవనెత్తడంతో అధికారికంగా ఫలితాన్ని ప్రకటించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. డిక్లరేషన్ పత్రంపై వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంతకం చేయడానికి నిరాకరించినట్టు సమాచారం. అయితే, ఈసీ సూచనలతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు విజయం సాధించినట్టు ప్రకటించారు. అయితే, టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ అభ్యర్థి దువ్వాడ ఆరోపించారు. ఈ విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. 
Read More

ప్రైవేట్ కు కర్నూలు ఆస్పత్రి సేవలు

May 24, 2019

కర్నూలు, మే 24, (way2newstv.com)
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే పలు సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తాజాగా ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు సర్వజనాసుపత్రిలో ప్రైవేటు మెడికల్‌ షాపులు ఉండేవి. అతి తక్కువ బాడుగకే షాపులు ఇచ్చేవారు. అయితే, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రైవేటు మెడికల్‌ షాపులను రద్దు చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఇక మీదట ఎలాంటి ప్రైవేటు మెడికల్‌ షాపులనూ అనుమతించవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పలు సంస్థలు కాంట్రాక్టు పనులు చేపడుతున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పనీ ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. రోగులకు ఆహార పంపిణీ మొదలుకుని.. సెక్యూరిటీ, స్కావెంజర్‌ పనులు, వివిధ పరికరాల కొనుగోళ్లు, మందుల సరఫరా వంటి అనేక కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలు చేపడుతున్నాయి. ఇందులో కొన్ని కాంట్రాక్ట్‌ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. వాటిని టెండర్లు పిలవకుండానే కొనసాగించారు.


ప్రైవేట్ కు కర్నూలు ఆస్పత్రి సేవలు
దీంతో ప్రస్తుతం జనరిక్‌ మందుల షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి ఎసరు పెట్టేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుచరుడికి అనుమతి ఇవ్వాలనే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న జనరిక్‌ మందుల దుకాణాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు. ఆసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో మంత్రి అనుచరుడు ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇవ్వొద్దంటూ గతంలో జారీచేసిన ఉత్తర్వులకు సైతం తూట్లు పొడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.తన అనుచరుడు షాపు పెట్టుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌పై మంత్రి ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే సాహసం కూడా సూపరింటెండెంట్‌ చేయడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. మంత్రి ఆదేశాలను ఆచరణలోకి తెచ్చేందుకు వీలుగా ఏం చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌  ఉన్న తరుణంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనను సైతం అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే టెండరు లేకుండానే డైట్‌ కాంట్రాక్టును మరో ఏడాది పాటు కొనసాగించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ద్వారా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెడికల్‌ షాపు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మొత్తమ్మీద ఆసుపత్రి కేంద్రంగా దందా కొనసాగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.పెద్దాసుపత్రి సూపరింటెండెంట్‌ ఏళ్లుగా అద్దె చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌లో ‘హార్ట్‌ ఫౌండేషన్‌’ కొనసాగించారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి మాటలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఇబ్బందులు వస్తాయనే ఆందోళనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనరిక్‌ ఔషధశాలలను దెబ్బతీసే విధంగా, ప్రైవేటు మెడికల్‌ షాపు ఏర్పాటుకు అనుగుణంగా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం.  
Read More

నాగబాబుకు కాపు కాయని జనసేన

May 24, 2019

ఏలూరు, మే 24, (way2newstv.com)
కొణిదెల నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్‌కి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్‌కి అన్నగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. నరసాపురం రాజకీయాల్లో ‘జనసేన’ చక్రం తిప్పేందుకు 2019 ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో జనసేన ఏయే సీట్లు గెలవబోతుందని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నాగబాబు పోటీ చేసిన నరసాపురంపైనే అందరి దృష్టి ఉంది. ఒకవైపు జనసేన ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్నా లేకపోయినా.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లడం ఖాయమే అని రాజకీయ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో నాగబాబు గెలుపు ఓటములపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జనసేన ఆశలు పెట్టుకున్న లోక్ సభ స్థానాలు నరసాపురం, అమలాపురం, వైజాగ్‌లు కాగా.. ఇంతకీ నాగబాబుకి గెలుపుపై బిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. జనసేనకు గంపగుత్తగా ఓట్లు పడతాయని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే.. అది కాపు సామజిక వర్గం నుంచే. నరసాపురం నియోజక వర్గానికి సంబంధించి దాదాపుగా 12 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండగా.. అందులో కాపు సామాజిక వర్గం ఓట్లు 3 లక్షల పైమాటే. 


నాగబాబుకు కాపు కాయని జనసేన

నరసాపురం సెగ్మెంట్స్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజక వర్గాలు.. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజక వర్గాల్లో కాపు సామజిక వర్గం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో పవన్ సపోర్ట్ చేసిన టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగటంతో పాటు స్వయానా అధ్యక్షుడి అన్నయ్య నాగబాబు ఇక్కడ పోటీ చేస్తుండటంతో బలమైన కాపు సామాజిక వర్గం నాగబాబు విజయం కోసం గట్టిగానే నిలబడిందని లోకల్ లీడర్స్ నుండి వినిపిస్తున్న మాట.  కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ఓట్ల చీలికలకు దారితీసిందనే వాదన వినిపిస్తోంది. ఇక నరసాపురంలో క్షత్రియ ఓటింగ్ కూడా ఎక్కువగా ఉండటంతో టీడీపీ, వైసీపీలు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల్ని బరిలోకి 
దింపింది. వైసీపీ తరుపున రఘురామకృష్ణంరాజు బరిలో నిలవగా.. టీడీపీ తరుపున వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ) బరిలో నిలిచారు. అయితే ఈ ఇద్దరూ క్షత్రియ కులస్థులు కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉందని భావించారు. ఇది జనసేనకు కలిసి వస్తుందని భావించారు. కాకపోతే నరసాపురం ధన ప్రవాహం బాగా పనిచేసిందని ఇందులో వైసీపీ అభ్యర్ధి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని తెలుస్తోంది. మొత్తానికి కుల సమీకరణాలు, సినీ గ్లామర్‌తో నాగబాబు నరసాపురం ‘జనసేన’ జెండా ఎగరేస్తారా అంట నో చెప్పేశారు ఓటర్లు. ఇక నరసాపురం లోక్‌ సభ 
స్థానానికి 1957 నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరగగా.. ఎనిమిది సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, రెండుసార్లు బీజేపీ, ఒకసారి సీపీఐ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన గుణ్ణం గంగరాజు గెలుపొందారు. 
Read More