హైద్రాబాద్, ఫిబ్రవరి 1, (way2newstv.com)
వీసా గడువు కొనసాగింపు విషయంలో ఓ భారీ అక్రమం అమెరికాలో బయటపడింది. స్వయంగా అమెరికా ప్రభుత్వమే నకిలీ యూనివర్సిటీని నెలకొల్పి నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్‌లో పే టు స్టే కుంభకోణం గుట్టు రట్టయింది.అక్రమ అడ్మిషన్లు పొందినవారిని సైతం భారీగా అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు.. వారిని వెనకకు పంపే ప్రక్రియ (డిపోర్టేషన్)ను చేపట్టారు. తొలుత వారిని ప్రశ్నించి వదిలివేస్తూ, కోర్టు నోటీసులు జారీచేశారు. ఈ ఘటనలో బాధితులు ఎక్కువమంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తున్నది. దేశంకాని దేశంలో ఉన్నట్టుండి వచ్చిపడిన ఆపదతో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కోర్టు నోటీసులకు జవాబులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పే టూ స్టేలో కదులుతున్న డొంక
అటువంటివారికి న్యాయపరమైన సహాయం అందించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించేలా సాగిన ఈ స్టింగ్ ఆపరేషన్‌ను స్వయానా అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) ఏజెంట్లు నిర్వహించడం విశేషం. వీసా గడువు ముగిసినా దాదాపు ఆరువందల మంది అమెరికాలోనే నివసించేందుకు సహకరించిన ఎనిమిదిమంది తెలుగు విద్యార్థులను మిషిగాన్ పోలీసులు మంగళ, బుధవారాల్లో అరెస్టుచేశారు. అరెస్టయినవారిలో కాకిరెడ్డి భరత్ (ఫ్లోరిడా), కండాల సురేశ్‌రెడ్డి (వర్జీనియా), కర్ణాటి ఫణిదీప్ (కెంటకీ), రాంపీస ప్రేమ్‌కుమార్ (నార్త్ కరోలినా), సామ సంతోష్‌రెడ్డి (కాలిఫోర్నియా), తక్కళ్లపల్లి అవినాశ్ (పెన్సిల్వేనియా), నూనె అశ్వంత్ (అట్లాంటా), ప్రత్తిపాటి నవీన్ (డల్లాస్) ఉన్నారు. వీరిలో ఆరుగురిని డెట్రాయిట్‌లో, ఇద్దరిని వర్జీనియా, ఫ్లోరిడాలో అరెస్టుచేశారు. మరింత విచారణ కోసం వారిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నదని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు తెలిపారు.అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై అగ్రరాజ్యం కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరెవరు తప్పుడు పత్రాలతో, గడువు ముగిసిన వీసాలతో అమెరికాలో నివసిస్తున్నారో గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం అండర్‌కవర్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ (హెచ్‌ఎస్‌ఐ) అధికారులు 2015లోనే డెట్రాయిట్‌లోని ఫర్మింగ్‌టన్‌హిల్స్‌లో ఒక చిన్న భవంతిలో ఫర్మింగ్‌టన్ యూనివర్సిటీ పేరిట ఒక నకిలీ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. దానికి ప్రభుత్వ గుర్తింపు ఉందని వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. వాస్తవానికి ఈ యూనివర్సిటీకి ఎలాంటి సిబ్బంది, టీచర్లు లేరు. తరగతులు కూడా నిర్వహించలేదు. అయితే.. ఇది పోలీసులు పన్నిన వల అన్న విషయం తెలియని దళారీలు.. వీసా గడువు ముగిసినవారిని తప్పుడు పత్రాలతో పెద్దసంఖ్యలో ఇందులో చేర్పించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ అధికారులను బురిడీ కొట్టించబోయి.. తామే పట్టుబడ్డారు. సదరు దళారీలు డబ్బులు తీసుకుని (పే టు స్టే) అడ్మిషన్లు ఇప్పిస్తున్నట్టు అమెరికా పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. బాధితుల్లో అత్యధికులు భారతీయులేనని ఐసీఈ అధికారి ఒకరు చెప్పారు.యూనివర్సిటీలో చేరే విద్యార్థులు వాస్తవానికి చదువుకునే ఉద్దేశంతో చేరినవారు కాదని, కనీసం క్లాసులకు హాజరైనవారు కూడా కాదని నివేదికలో తెలిపారు. ఈ కుట్రలో భాగస్వాములైనవారందరికీ ఈ యూనివర్సిటీలో ఇన్‌స్ట్రక్టర్లు లేరని, తరగతులు జరుగవని తెలుసునని పేర్కొన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి తమ కస్టమర్లయిన విద్యార్థులను కాపాడేందుకు దళారులు ఈ యూనివర్సిటీలో తప్పుడు పత్రాలతో అడ్మిషన్లు ఇప్పించారని తెలిపారు. ఇందుకోసం సుమారు రెండున్నర లక్షల డాలర్లు వసూలు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ వీసా స్టేటస్‌ను సీపీటీ (కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్) కార్యక్రమం కింద చూపేందుకే ఈ యూనివర్సిటీలో చేరినట్టు కనిపిస్తున్నదని నివేదికలో తెలిపారు. తప్పుడు పత్రాలతో యూనివర్సిటీలో చేరిన విద్యార్థులను అధికారులు ప్రశ్నించి, వదిలివేశారు. అయితే వారికి కోర్టునోటీసులు జారీచేశారు. నకిలీ వీసా రాకెట్ల గుట్టు రట్టుచేసేందుకు నకిలీ యూనివర్సిటీ ద్వారా అండర్‌కవర్ ఆపరేషన్‌ను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ చేపట్టడం ఇది రెండోసారి. 2016లో ఇదేవిధంగా నార్తర్న్ న్యూజెర్సీ యూనివర్సిటీ పేరిట అడ్మిషన్లు స్వీకరించి, తప్పుడు పత్రాలతో ఉన్న సుమారు 21 మంది విద్యార్థులను ఐసీఈ అరెస్టుచేసింది.
Tags:
all india news
