హైద్రాబాద్, మార్చి 29, (way2newstv.com)
ఉస్మానియా భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. ఈ భవనాన్ని వినియోగించడం శ్రేయస్కరం కాదని ఇంజినీరింగ్ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా నూతన భవన నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైంది. భవన నిర్మాణం మూడు అడుగులు ముందుకు ఆరుగుడులు వెనక్కు అన్న చందంగా మారింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి, వైద్య, విద్యా సంచాలకులు హమీల మీద హామిలిచ్చినా అడుగు ముందుకు పడడం లేదు. భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా చేపట్టాలని ఆసుప్రతి డాక్టర్లతో పాటు అధికారులు, సిబ్బంది అన్ని విభాగాలు కలిపి జేఏసీగా ఏర్పాటై ఆందోళనకు దిగారు. ఆసుప్రతికి నూతన భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ హయాం నుంచే సన్నాహాలు చేస్తున్నా కదలిక ఉండడం లేదు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో ఆసుప్రతి భవన నిర్మాణం కోసం రూ.200 కోట్లను విడుదల చేసినా ఆ నిధులు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి.
కొత్త భవనం కోసం ఆందోళనలు
ఆ తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ఆసుప్రతిని పరిశీలించి నూతన భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. పురాతన కట్టడమైన భవనం కూల్చివేతపై పలు రకాల అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొంత గందరగోళం నెలకొంది. ఆ తర్వాత పక్కనున్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం రూపొందించిన వైద్యరోగ్యశాఖ భవన నిర్మాణ నమూనాలను మంత్రి పరిశీలించారు. భవన నిర్మాణ పనులు హామీలు, పరిశీలనకే పరిమితం కావడంతో ఆసుప్రతి వర్గాలు ఆందోళనకు దిగాయి. దీనికి స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, వైద్య, విద్యా సంచాలకులు రాత పూర్వకంగా హామీనిచ్చారు. కానీ ఇప్పటి వరకు పనులకు సంబంధించిన చర్యలు చేపట్టలేదు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉస్మానియా ఊసే లేకపోవడంతో ఆందోళనను తీవ్రం చేయాలని జేఏసీ నిర్ణయిచింది.భవన నిర్మాణం కోసం ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు జెఎసి చైర్మన్, డాక్టర్ పాండునాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మొదలుకొని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వరకు అందరూ హామీలిచ్చినా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదన్నా రు. భవన నిర్మాణం విషయంలో ప్రభుత్వంతో పాటు అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. దశల వారీగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వైద్య సేవలను కూడా నిలిపివేస్తామన్నారు. అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపివేసేందుకు వెనుకాడమన్నారు. ప్రజలతో పాటు ఆసుప్రతిలో పనిచేసే సిబ్బంది మొదలుకొని ఉన్నతస్థాయి వరకు అందరి డిమాండ్ ఆసుప్రతి నూతన భవనమేనన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సేవలను అందిస్తున్నామని, ఆసుప్రతికి వచ్చే వారు కూడా అదే రకమైన ఆందోళనతో ఉన్నారని తెలిపారు.