తిరుపతి, ఏప్రిల్ 1 (way2newstv.com)
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఎదురు ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా తిరుమంజనం
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 10.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయ డెప్యూటీ ఈవో శ్రీధర్, ఏఈవో తిరుమలయ్య, సూపరింటెండెంట్ జి.రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వై.రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
ఆలయానికి విరాళాలు :
శ్రీ కోదండరామాలయానికి సోమవారం హైదరాబాదుకు చెందిన ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు దాదాపు 2 లక్షలు విలువైన పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు.
ఏప్రిల్ 2న అంకురార్పణ :
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటలకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.