ఉపాధి కూలీలకు వడదెబ్బలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉపాధి కూలీలకు వడదెబ్బలు

అదిలాబాద్, మే 15, (way2newstv.com)
వేడిగాలులతో ఆదిలాబాద్ జిల్లా అట్టుడికిపోతోంది. నాలుగు రోజులుగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా దడ పుట్టించే వడగాలులకు జనం బెంబేలెత్తుతున్నారు. రోజు వారి కూలీ నాలి చేసుకునే సామాన్య జనం, ఉపాధి హామీ కూలీలు, అటవీ ఉత్పత్తులు సేకరించే గ్రామీణ కుటుంబాలు వడదెబ్బతో  మృత్యువాత పడుతున్నారు. 40రోజుల్లోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు గురై మృత్యువాత చెందిన వారి సంఖ్య 32కు చేరుకుంది. సోమవారం బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్ గ్రామానికి చెందిన ఎగ్గె మల్లేష్  తునికాకు సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్ళి సొమ్మసిల్లి అక్కడికక్కడే మృతి చెందాడు. వారంరోజుల కిందటే ఇదే మండలంలోని లోడుపల్లికి చెందిన నాయిని పోశం మృతి చెందాడు. బెజ్జూర్ మండలంలోనే 20రోజుల్లో నలుగురు మృతి చెందిన సంఘటన ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ భీకరమైన వడగాలులకు పిల్లలు, వృద్దులు తీవ్ర అస్వస్థతో ఆసుపత్రుల పాలవుతున్నారు. 


ఉపాధి కూలీలకు వడదెబ్బలు

జ్వరాలు, వాంతులు విరేచనాలతో వడదెబ్బకుగురై రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు ప్రజలకు తెలియజేయడంలేదు. పైగా అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన వైద్యశాఖ కరపత్రాల ద్వారా, గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజలను చైతన్యపర్చాల్సి ఉండగా తమ బాధ్యతలను విస్మరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లో ఉపాధి హామీ కూలీలే అత్యధికంగా మృతి చెందడం గమనార్హం. తలమడుగు మండలంలోనే ముగ్గురు ఉపాధి కూలీలు మృతి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో కూలీ పని చేసేచోట ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించకపోవడం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ ఇవ్వకపోవడం గమనార్హం. అధికారులు వెంటనే వడదెబ్బ మృతులను గుర్తించి, ఆపద్బందు పథకం కింద రూ.50వేల ఎక్స్‌గ్రేషియా అందించాల్సి ఉండగా, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆయా కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోతున్నారు. వడదెబ్బ మృతులను గుర్తించి సాయం అందించేందుకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసినా జిల్లాలో ఎక్కడ వారి జాడ కనిపించడం లేదు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో ఎండల తీవ్రత నేపథ్యంలో పని వేళల్లో మార్పులు చేయడమే గాక మధ్యాహ్నం పూట గంటపాటు కార్మికులకు విశ్రాంతి నిస్తున్నారు. జిల్లాలో సోమవారం 45.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, రాత్రివేళల్లోనూ వేడిగాలుల సెగలు తగ్గడంలేదు. ఆస్పత్రుల్లో వడదెబ్బకు గురైన బాధితులకు ప్రాథమికంగా మందులు, కిట్స్ అందించాల్సి ఉండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. జిల్లాలో నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నివారణ చర్యలపై కరపత్రాలు, పత్రికా ప్రకటనల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది.