ప్రకాశంలో ఆమంచికి చెక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశంలో ఆమంచికి చెక్


ఒంగోలు, మే 24, (way2newstv.com)
ఏపీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో అందర్ని దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం చీరాల. మొదటి నుంచి టీడీపీకి అడ్డాగా ఉన్న చీరాలలో.. గత 15 ఏళ్లగా పాగా వేయలేకపోయింది. ఈసారి ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినా.. 1999 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పసుపు జెండా ఎగిరింది. వైసీపీ నుంచి పోటీచేసిన ఆమంచి కృష్ణమోహన్‌పై టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణ మూర్తి 17,801 మెజార్టీతో విజయం సాధించారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే.. 1983లో ప్రస్థానం ప్రారంభంకాగా.. తొలిసారి చిమటా సాంబు టీడీపీ నుంచి విజయం సాధించారు. 1985లో సజ్జా చంద్రమౌళి తెలుగు దేశం నుంచి గెలిచారు. 1989లో కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. 1994, 1999లో పాలేటి రామారావు టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 


ప్రకాశంలో ఆమంచికి చెక్
2004లో మళ్లీ కాంగ్రెస్ గాలి బలంగా వీయడంతో కొణిజేటి రోశయ్య గెలుపొందారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న కొణిజేటి రోశయ్య.. తన శిష్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు. ఆ ఎన్నికల్లో ఆమంచి ఘన విజయం సాధించారు. చీరాలలో సొంత వర్గాన్ని, ప్రజల్లో ఫాలోయింగ్ సంపాదించారు. తర్వాత రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ కనుమరుగు కావడంతో.. కృష్ణమోహన్‌ నవోదయ పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు. తర్వాత టీడీపీలో చేరిపోవడం చక,చకా జరిగిపోయాయి. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు ఆమంచి టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ తరపున చీరాల నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇటు టీడీపీ కూడా ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని భావించింది.. అందుకే సీనియర్ నేత కరణం బలరాంను రంగంలోకి దింపింది. గతంలో నియోజకవర్గంలో ఉన్న పాతపరిచయాలతో టీడీపీని బలోపేతం చేశారు. కేడర్‌, నేతల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. చీరాలలో హ్యాట్రిక్ కొట్టాలని కసితో ఉన్న ఆమంచి కూడా.. నియోజకవర్గంలో పాత, కొత్త నేతలు-కేడర్ సమన్వయంతో పనిచేసేలా చూసుకున్నారు. ఈ ఇద్దరు నేతలు పోటా-పోటీగా చీరాలలో ప్రచారంతో హోరెత్తించారు. కానీ విజయం మాత్రం బలరాంనే వరించింది.