ఉన్నత రాజ్యాంగబద్ధ స్థానాల్లో ఉన్నవారు నిష్పాక్షికంగా, సందేహాలకు అతీతంగా ఉండాలని మనం ఆశిస్తాం. ఈ సందర్బంగా జూలియస్ సీజర్ భార్య ఉదంతాన్ని ప్రస్తావిస్తుంటాం. లేశమాత్రం కూడా అనుమానానికి తావివ్వకుండా స్వచ్ఛంగా ఉండాలనేది దాని ఉద్దేశం. తొంభై కోట్ల పైచిలుకు ఓటర్ల తీర్పును పట్టి చూపి పాలకులకు పట్టంగట్టే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. రాజులు, రాజ్యాలు గతించిన తర్వాత ప్రజలే ప్రభువులు. వారు ఎన్నుకునే ప్రతినిధులే సార్వభౌములు. విధాన నిర్ణయాలు మొదలు దేశ సంక్షేమం వరకూ వారిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే డెమొక్రసీలో ఎలక్షన్ అంటే ఒక పవిత్రకర్తవ్యంగా చూస్తుంటాం. ప్రజల ప్రాథమిక హక్కుగా, కర్తవ్యంగా కూడా చెప్పుకుంటుంటాం. రాజ్యాధికారం కోసం , పదవుల కోసం తద్వారా లభించే పెత్తనం కోసం పాకులాడే పార్టీలకు దేశంలో కొదవ లేదు. అధికారం కోసం తొక్కని అడ్డదారులూ లేవు.
ఎన్నికలు ముగిశాయి... ఆరోపణలు మిగిలాయి
సామదానభేదదండోపాయాలన్నీ మన రాజకీయపక్షాలకు కొట్టిన పిండే. కానీ ఎన్నికల సంఘమే కొందరికి కొమ్ము కాస్తోందని విపరీతమైన ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీస్తోంది.పవర్ లోకి వస్తామంటే ప్రత్యర్థిని పరలోకాలకు పంపడానికీ సిద్దమైపోతున్నారు కొందరు నేతలు. అందుకు పార్టీలు వత్తాసు ఇస్తున్నాయి. పదులు వందల కోట్లు కుమ్మరించి ఓటరు తీర్పును కొనేస్తున్నారు. అందుకే నిఘా వ్యవస్థలు నిజాయతీగా ఉంటేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కు పీఠం వేయగలుగుతాం. ప్రజామనోగతానికి పట్టాభిషేకం చేయగలుగుతాం. అంతటి పెద్ద పనిని నిభాయించే కర్తవ్యాన్ని రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్ భుజస్కంధాలపై ఉంచింది. సర్వంసహా అధికారాలనూ కల్పించింది. కానీ ఏం జరుగుతోంది? ఎన్నికల ప్రక్రియ మొదలు ఫలితాల వెల్లడి వరకూ సందేహాలే..ప్రతిఘట్టంపైనా విమర్శలే..షెడ్యూల్ ప్రకటించే సమయం మొదలు..రీ పోలింగు నిర్ణయం వరకూ ఆరోపణలే. అధికారపక్షంతో అంటకాగుతోందనే అనుమానాలే. అసలే మనదేశంలో ప్రజాస్వామ్యమంటే నేతిబీర చందం. ఫస్టు పాస్ట్ ద పోస్టు అని ఒక తంతు.. జనంలో మూడో వంతు మంది అసలు పోలింగు ముఖం చూడరు. ఎవరొచ్చినా ఏం ఒరగబెడతారనే నిరాసక్తత వారిది. సెలవును ఎంజాయ్ చేసే సరదా ’సిటీ‘ జనులు మరికొందరు. ఫలితంగా అతి తక్కువ ఓట్లతోనే ప్రజాప్రతినిధులు ఎన్నికైపోతున్నారు. అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నారా? అంటే చెప్పలేం. దేశంలో తొంభైశాతం మంది చట్టసభల సభ్యులు కనీసం యాభైశాతం ఓట్లు తెచ్చుకోకుండానే ప్రతినిధులైపోతున్నారు.ఏదేమైతే నేం నలుగురైదుగురు బలంగా పోటీ పడితే నాలుగో వంతు ఓట్లు వచ్చినా ఎమ్మెల్యే,ఎంపీ అయిపోతారు. అంటే నూటికి పాతిక ఓట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. మిగిలిన 75 మంది అభిప్రాయంతో సంబంధం ఉండదు. వారి ఓటుకు విలువా దక్కదు. కనీసం ఆమాత్రం ప్రజాస్వామ్యాన్ని అయినా కాపాడుకోవడం అవశ్యం. లేకపోతే వ్యవస్థలపైనే నమ్మకం పోతుంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం కేంద్రం చెప్పినట్లు వింటోందని దేశవ్యాప్తంగా అలజడి రేకెత్తుతోంది. పదే పదే అదే అదే విమర్శ ఎదురుకావడం ఎన్నికల సంఘానికి శోభస్కరం కాదు. హస్తిన మొదలు పశ్చిమబంగ, ఉత్తరప్రదేశ్ లలో కంపించి మహారాష్ట్ర మీదుగా ఆంధ్రా తమిళనాడు వరకూ అవే ఆరోపణలు వెల్లువెత్తడం కచ్చితంగా ప్రజాస్వామ్యానికి నష్టదాయకమే. ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు మాయని మచ్చే. ఎన్నికల సంఘమంటే పార్టీలకే కాదు, సామాన్యునికి సైతం తెలియచెప్పిన శేషన్ వంటి వారు నేతృత్వం వహించినప్పుడు ఇటువంటి పక్షపాత ఆరోపణలు ఎందుకు తలెత్తలేదన్న విషయాన్ని భారత ఎన్నికల సంఘం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. మరింతగా దిగజారకుండా కాపాడుకోవడం ఎన్నికల సంఘం భవితవ్యానికి చాలా అవసరం. నలభై రోజుల తర్వాత చంద్రగిరి రీపోలింగ్ చర్చ రచ్చను తలపిస్తోంది. ఇక పశ్చిమబంగలో అన్ని విడతల్లోనూ పక్షపాత భూతద్దాలే వెన్నాడుతున్నాయి. బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెసు ఎన్నికల సంఘాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ దాదాపు యుద్ధమే సాగించాయి. టీఎంసీ ఎలక్షన్ కమిషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరుచుకుపడుతోంది. భారతీయజనతాపార్టీ అంతే బలంగా ఎన్నికల సంఘాన్ని సమర్థిస్తోంది. రెండు పార్టీల గొడవలో కమిషన్ పరువు బజారున పడింది. బీజేపీ కూడా సంఘాన్ని తన భుజంపై మోయాల్సిన అవసరం లేదు. అందువల్ల మరిన్ని అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఏదో జరుగుతోందనే అనుమానమేఘాలు కమ్ముకున్నాయి. సాధారణ ఓటరు దీనిని విశ్వసిస్తున్నాడు. కేంద్రం మద్దతు విషయాన్ని పక్కనపెడితే ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోగల అధికారాలు కమిషన్ కు ఉన్నాయి. న్యాయస్థానాలు సైతం అంత తొందరగా కమిషన్ పనితీరులో జోక్యం చేసుకోవు. అందువల్ల తమకు లభించిన సాధికారతను సక్రమంగా వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ లో ఎవరున్నారనేది ముఖ్యం కాదు. అది నిర్వహించే ప్రజాస్వామ్య యజ్ణం పట్ల ప్రజావిశ్వాసం ముఖ్యం. ఆ నమ్మకమే కోల్పోతే ప్రజాస్వామ్యమే అర్థరహితం. ప్రపంచం ముంగిట్లో లార్జెస్టు డెమొక్రసీ నవ్వులపాలవుతుంది. అందుకే తరతమ భేదాలకు అతీతంగా..అధికార విపక్షాల వ్యత్యాసాలు కనబరచకుండా ..సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబౌ సస్పిషన్ అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉంటుంది. ఇందుకు కమిషన్ కు నాయకత్వం వహించే ప్రతి ఒక్కరూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి. అధికారంలో ఉన్న పార్టీలు, బ్లాక్ మెయిల్ చేసే విపక్షాల ఒత్తిడులకు ఎన్నికల సంఘం అస్సలు లొంగకుండా నిజాయతీగా, ధైర్యంగా వ్యవహరించాలి.
Tags:
all india news