కర్నూలులో సగానికి పడిపోయిన మామిడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో సగానికి పడిపోయిన మామిడి


కర్నూలు, మే 28, (way2newstv.com)
మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. మామిడి కాయలు నిల్వ చేసి ఎగుమతి చేసేందుకు అవకాశం లేక జిల్లా రైతులే  జాతీయ రహదారిపై అమ్మకాలు చేపట్టారు.  కర్నూలు–బెంగళూరు రహదారి, కర్నూలు– చిత్తూరు రహదారి పై చిన్న కొట్లను ఏర్పాటు చేసుకుని మామిడి పండ్లు విక్రయిస్తున్నారు.మామిడి దిగుబడి సాధారణంగా మార్చి నెల నుంచే ప్రారంభం కావాలి. ఈసారి ఏప్రిల్‌ 3వ వారం నుంచి మొదలైంది. దీనికితోడు గాలి, వానలకు సుమారు వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాధారణంగా ఎకరా మామిడి తోటకు ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా  ఒకటిన్నర టన్ను మాత్రమే వచ్చింది. 


కర్నూలులో సగానికి పడిపోయిన మామిడి
ఈ పండ్లు కూడా  గత నెలలో  డజను ధర రూ.150 పలకగా ఇప్పుడు  రూ.75కి పడిపోయింది.పక్వానికి వచ్చిన మామిడి కాయలకు సరైన ధర లభించక, తక్కువ ధరకు ఎగుమతి చేయలేక కొందరు రైతులు చిరు వ్యాపారుల అవతారమెత్తాల్సి వస్తోంది. మరి కొందరు గ్రామాల్లో సైకిళ్ల పై, తోపుడు బండ్ల పై తిరుగుతూ అమ్ముతున్నారు. సకాలంలో విక్రయించుకోకపోతే పండ్లు దెబ్బతింటాయి. దీంతో లాభం లేకపోయినా పర్వాలేదు కానీ  నష్టం రాకపోతే చాలని   వినియోగదారులు  అడిగిన ధరకే ఇచ్చేస్తున్నారు. జిల్లాలో బనగానపల్లె, డోన్, రామళ్లకోట, గోవర్ధనగిరి, ప్యాపిలి, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాల తదితర ప్రాంతాల్లో సుమారు 20వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు  ఉన్నాయి. పక్వానికి వచ్చిన కాయలను పండ్లుగా మార్చి వ్యాపారం చేసేందుకు  స్థానికంగా సరైన రైపనింగ్‌ (మాగబెట్టే) కేంద్రాలు లేవు. కర్నూలు, డోన్‌లలో ఆ కేంద్రాలు ఏర్పాటు దశలోనే ఉన్నాయి. అదే  రైప్‌నింగ్‌ కేంద్రాలు ఉంటే  కాయలను మాగించి గిట్టుబాటు ధరకు విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.