ఆగస్టు ఒకటి నుంచే అక్షయ పాత్ర భోజనాలు


విశాఖపట్టణం, జూన్ 4, (way2newstv.com)
అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర భోజనాలు పంపిణీ మరింత జాప్యం కానుంది. ఆహార పదార్థాల తయారు చేయడానికి అవసరమ్యే కిచెన్‌ సిద్ధం కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి జూన్‌ ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్షయపాత్ర భోజనాలు పెట్టడానికి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటివరకు అక్షయపాత్ర సంస్థ కిచెన్‌ ఏర్పాటు చేయకపోవడంతో మరో రెండు నెలలు వాయిదా తప్పేలాలేదు. ప్రస్తుతం కంచరపాలెం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో అక్షయపాత్ర వంటశాల వుంది. దాని సామర్థ్యం సరిపోకపోవడంతో కొత్త కిచెన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్షయపాత్ర సంస్థకు  లబ్ధిదారునికి భోజనానికి రూ.7వంతున చెల్లించాలని నిర్ణయించారు. రోజూ అన్నం, నాలుగు రోజులు పప్పు, రెండు రోజులు సాంబారు, రెండు రోజులు ఆకుకూర మెనూ కింద నిర్ణయించారు. 


 ఆగస్టు ఒకటి నుంచే అక్షయ పాత్ర భోజనాలు
ఇక రోజూ సాయంత్రం చిరుతిండ్లు కూడా అక్షయపాత్ర సంస్థ ద్వారా సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఒక్కో కేంద్రంలో లబ్ధిదారునికి రూ.20తో పాలు, గుడ్లు, మధ్యాహ్నం భోజనాలు అందజేస్తున్నారు దీంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భోజనాలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటికే ప్రభుత్వ, మున్సిపల్‌ పాఠశాలలు, అన్నక్యాంటీన్లకు  భోజనాలు అందజేస్తున్న అక్షయపాత్ర సంస్థ భీమిలిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు మే ఒకటి నుంచి  మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తుంది. భీమిలి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని 232 అంగన్‌వాడీ కేంద్రాలకు తొలివిడతగా అక్షయపాత్ర భోజనాల సరఫరా ప్రారంభించారు. అక్కడ 5712 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్న అమృతహస్తం పథకం కింద సిబ్బంది వంటలు చేసి మధ్యాహ్నభోజనాలు పెట్టడం తెలిసిందే. రేషన్‌డిపోల ద్వారా బియ్యం, కందిపప్పు, వంటనూనె సరఫరా చేసేవారు. ఇక కూరగాయలు బయట కొనుగోలు చేసి  వండేవారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్లలోపు వయసు గల పిల్లలు, గర్భిణులు, బాలింతలకు రోజూ ఆయా కేంద్రాల్లో మధ్యాహ్నం భోజనాలు వడ్డిస్తున్నారు. తాజాగా నగరంలో పిఠాపురం కాలనీలో గల అర్బన్‌–2,  మర్రిపాలెంలో గల అర్బన్‌–1 ఐసీడీఎస్‌ ప్రాజెక్డుల పరిధిలో ఆగస్టు నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది.అంగన్‌వాడీ లబ్ధిదారులకు ప్రస్తుతం ఇస్తున్న పాలు, గుడ్ల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు వారంలో నాలుగుసార్లు, పిల్లలకు రెండుసార్లు గడ్లు ఇస్తున్నారు. ఇక గర్భిణులు, బాలింతలకు, శామ్‌ (తక్కువ బరువు)పిల్లలకు రోజుకు 200మిల్లీలీటర్ల వంతున పాలుఇస్తున్నారు.
Previous Post Next Post