మారని బాబు వైఖరి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మారని బాబు వైఖరి

నిరాశలో కర్నూలు తమ్ముళ్లు
కర్నూలు, జూలై 13, (way2newstv.com)
తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు నాన్చుడు ధోరణి పార్టీ కార్యకర్తలకు విసుగు తెప్పిస్తుంది. ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిర్ణయం పై కాలయాపన చేయడం మామూలే. ఈ విషయం కిందిస్థాయి కార్యకర్త నుంచి బడా నేత వరకూ తెలియంది కాదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయిన చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతల్లో నూ భరోసా నింపాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడిపైనే ఉంది. అయినా కొన్ని సమస్యలను ఆయన సత్వరమే పరిష్కరించకపోవడం చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా ఇటీవల పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 
మారని బాబు వైఖరి

అయితే కర్నూలు నియోజకవర్గ ఇన్ ఛార్జి బాధ్యతల విషయంలో చంద్రబాబు నాయుడు ఇంకా నాన్చుడు ధోరణినే అవలంబిస్తున్నారు. టీజీ వెంకటేష్ బీజేపీలో చేరినా ఇంకా అక్కడ పార్టీ ఇన్ ఛార్జి నియామకంపై చంద్రబాబునాయుడు నుంచి స్పష్టత రాలేదు.ఇక ధర్మవరం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వరదాపురం సూరి భారతీయ జనతా పార్టీలో చేరి నెలరోజులు కావస్తుంది. దీంతో ధర్మవరం నియోజకవర్గంలో పార్టీని నడిపే నాధుడు కరవయ్యారు. ఇక్కడ సరైన నేతను చూడాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అప్పగించారు. చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనలో ధర్మవరం పార్టీ ఇన్ ఛార్జిని ప్రకటించాలని నిర్ణయించారు.అయితే బీకే పార్థ సారథి, కాల్వ శ్రీనివాసులు చెప్పిన పేర్లను ధర్మవరం టీడీపీ కార్యకర్తలు అంగీకరించలేదు. ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలు పరిటాల శ్రీరామ్ కు ధర్మవరం పార్టీ బాధ్యతలను అప్పగించాలని చంద్రబాబునాయుడు ఎదుటే గట్టిగా ఆందోళనకు దిగారు. అయితే ఆయనకు రాప్తాడు బాధ్యత ఉందని చెప్పినా కార్యకర్తలు విన్పించుకోలేదు. దీంతో చంద్రబాబునాయుడు పరిటాల సునీత, బీకే పార్థసారథి, నిమ్మల కిష్టప్ప, కాల్వ శ్రీనివాసులతో కమిటీ వేస్తానని కార్యకర్తలకు నచ్చ చెప్పినా వారు ఊరుకోలేదు. కమిటీలతో కాలయాపన చేయొద్దని, వెంటనే ధర్మవరానికి పరిటాల శ్రీరామ్ ను ఇన్ ఛార్జిగా నియమించాలన్న కార్యకర్తల డిమాండ్ కు చంద్రబాబునాయుడు తలవంచక తప్పలేదు. ఇకనైనా నాన్చుడు ధోరణిని వీడాలని పార్టీ నేతలు సయితం కోరుకుంటున్నారు