సోలార్ ప్రోడక్ట్స్ పై నీలినీడలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోలార్ ప్రోడక్ట్స్ పై నీలినీడలు


కర్నూలు, జూలై  8, (way2newstv.com
రాయలసీమలో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిపై నీలినీడలు అలముకుంటున్నాయి. ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన కర్నూలు జిల్లా ఓర్వకల్లు, గడివేముల మండలాల్లో నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేయాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులపై కొందరు రాజకీయ నాయకులు దాడులు, హెచ్చరికలు చేస్తున్న నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తి చేయలేమని కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి అనంతరం ప్రభుత్వం కొనుగోలు ధర తగ్గించే యోచనలో ఉండడంతో నష్టపోవాల్సి వస్తుందన్నది అసలు కారణంగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోనే కాకుండా అనంతపురం, కడప జిల్లాల్లోని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై గత కొద్ది రోజులుగా వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కడప జిల్లా మైలవరంలో పరిహారం చెల్లింపులో జాప్యం నేపధ్యంలో ఇటీవల స్థానికులు సౌర విద్యుత్ ఫలకాలు ధ్వంసం చేశారు. 



సోలార్ ప్రోడక్ట్స్ పై నీలినీడలు

దీంతో సుమారు రూ.3 కోట్ల మేరకు నష్టం సంస్థకు నష్టం వాటిల్లింది. తాజాగా కర్నూలు జిల్లాలో కొందరు వైసీపీ నాయకులు తమను తుపాకులతో బెదిరించి ఉత్పత్తి కేంద్రంలోని పలు ఇతర విభాగాల కాంట్రాక్టులు తమకు ఇవ్వాలని బెదిరించినట్లు విద్యుత్ ఉత్పత్తిదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి చేయడం కష్టతరంగా మారిందని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించిన పత్రినిధులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తి చేయలేమని పేర్కొంటూ ఉత్పత్తి నిలిపి వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన గడివేముల, ఓర్వకల్లు మండలాల పరిధిలోని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపి వేస్తే ఎదురయ్యే సమస్యలు ఏమిటన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మండలాల్లో 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సుమారు ఆరు కంపెనీలు చేపట్టాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు సుమారు 5 వేల ఎకరాలు ఉన్నాయి. నేరుగా రైతుల నుండి రూ.5.20 లక్షలతో ఒక్కొక్క ఎకరా భూమిని ఆయా కంపెనీలు కొనుగోలు చేయగా ప్రభుత్వ భూములు, ప్రజలకు పంపిణీ చేసిన భూములు ఎకరాకు రూ.4.20 లక్షలు వెచ్చించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు అయిన ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖ సమీక్షలో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తి అంశంలో సుమారు రూ.2,600 కోట్ల అవినీతి జరిగిందని నిగ్గుతేల్చింది. ఈ సొమ్ము రికవరి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల ఎంపిక, కొనుగోలు ధరలో అవినీతి జరిగిందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అయితే కేంద్ర ఇంధన వనరులశాఖ మాత్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, అంతా పారదర్శకంగానే ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో సౌర విద్యుత్ కంపెనీలు రాజకీయ దాడులను ఎదుర్కోవడంతో విద్యుత్ ఉత్పత్తిపై పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకవేళ సౌర విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా కనీస స్థాయికి పడిపోయి విద్యుత్ కోతలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే పగటి పూట రైతులకు 9 గంటల నిరంతరాయ విద్యుత్‌ను అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు న్యాయపరమైన చిక్కులు లేనిపక్షంలో ఉత్పత్తి నిలిపివేస్తే రాష్ట్రం విద్యుత్ సరఫరాలోనే కాకుండా ఆదాయ వనరులపై దెబ్బ పడుతుందని భావిస్తున్నారు.