సోషల్ మీడియాకు ఆధార్ లింక్ లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సోషల్ మీడియాకు ఆధార్ లింక్ లు

హైద్రాబాద్, ఆగస్టు 20  (way2newstv.com):
మీరు వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌కు ఇకపై ఆధార్ నంబర్‌తో అనుసంధానించాల్సి రావచ్చు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యుట్యూబ్, గూగుల్‌లల్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి ఆధార్ నంబర్‌ను పొందుపరచాల్సి రావచ్చు. ఈ విషయంపై అభిప్రాయాలను వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి నోటీసులను జారీ చేసింది. ట్విట్టర్, గూగుల్, యుట్యూబ్ సంస్థల యాజమాన్యాలకు కూడా అత్యున్నత ధర్మాసనం నోటీసులు పంపింది. సెప్టెంబర్ 13లోగా ఈ విషయమై అభిప్రాయాలను వెల్లడించాలని ఆయా కంపెనీలను సుప్రీం ఆదేశించింది. 
సోషల్ మీడియాకు ఆధార్ లింక్ లు

సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఆధార్‌తో అనుసంధానించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి, , అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి, దేశ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇలా చేయడం వల్ల తమ యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఫేస్‌బుక్ ఆరోపిస్తోంది. ఈ విషయమై కోర్టును ఆశ్రయించింది. మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లోనూ ఆధార్‌తో సోషల్ మీడియా ప్రొఫైళ్లను అనుసంధానించాలనే పిటీషన్లు ఇదివరకే దాఖలయ్యాయి. దీంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పిటీషన్ల విచారణను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఫేస్‌బుక్ యాజమాన్యం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. సోషల్ మీడియా ప్రొఫైళ్లను ఆధార్ కార్డుతో లింక్ చేయాలనే పిటీషన్‌పై జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందు సోమ, మంగళవారాల్లో ఫేస్‌బుక్ వాదనలను వినిపించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఫేస్‌బుక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను వినిపించారు. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని.. కంటెంట్‌ను తాము కూడా యాక్సెస్ చేయలేమని ఫేస్‌బుక్ న్యాయస్థానానికి తెలిపింది.