అమరావతి ఆగస్టు 26 (way2newstv.com):
టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక సూచన చేసింది. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సోమవారం యరపతినేని మైనింగ్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది.
యరపతినేని మైనింగ్ కేసులో హైకోర్టు కీలక సూచన
సీఐడీ విచారణలో యరపతినేని అక్రమాలపై సాక్ష్యులు కీలక విషయాలు వెల్లడించారని, అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ నివేదిక ద్వారా అర్థమవుతోందని హైకోర్టు పేర్కొంది. యరపతినేనికి సంబంధించిన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్లు అనుమానాలున్నాయని అంది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.