సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు

కడప, సెప్టెంబర్ 24, (way2newstv.com)
రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి (జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది.  రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. 
సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు.