విజయవాడ, సెప్టెంబర్ 25, (way2newstv.com)
ఏం జరిగిందో చెప్పరు. తమకు తెలిసింది రాసుకుంటే కాదంటారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఎవరికి వారు తోచినట్లు కథనాలు వండేశారు. కొన్ని పత్రికలు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తిని ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తం చేశారని రాశాయి. మరికొందరు ఇద్దరూ కలసి మోదీ వద్దకు వెళ్లి తాడో పేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నారని కథనాలు రాసేశాయి. అయితే ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఇప్పటి వరకూ ఏ అంశంపైనా స్పందించని సీఎం కార్యాలయం మోదీ విషయానికి వచ్చే సరికి రెస్పాండ్ కావడం ఆలోచించదగ్గ విషయమే.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అందరికీ ఆసక్తికరమే.
ఏపీ సీఎంవో రెస్పాండ్ పై తీవ్ర చర్చ
నిన్న మొన్నటి వరకూ కలసి ఉన్న రాష్ట్రాలు కాబట్టి సహజంగానే జగన్, కేసీఆర్ భేటీలపై ఆసక్తి, ఉత్కంఠ ఉంటుంది. జగన్,కేసీఆర్ ఏదో ఒక గంటా పిచ్చాపాటీ మాట్లాడుకోవడానికి కలవలేదు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశమయ్యారు. ఆ సమావేశం వివరాలను బయటకు చెప్పలేదు. ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని వెళ్లిపోయారు. గోదావరి జలాల మళ్లింపుపైనే ఎక్కువ చర్చ జరిగిందని తెలంగాణ సీఎంవో కార్యాలయం తెలిపింది.అయితే ఇన్నాళ్లూ ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించని ఏపీ సీఎంఓ మాత్రం మోదీ విషయానికి వచ్చే సరికి రెస్పాండ్ అయింది. మోదీకి వ్యతిరేకంగా వీరు సమావేశమయ్యారన్న వార్తను ఖండించింది. మోదీపై అసంతృప్తిని ఇద్దరు ముఖ్యమంత్రులు వెళ్లగక్కలేదని జగన్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ఊహాజనిత అంశాలు రాయవద్దని హితవు పలికింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారని జగన్ కార్యాలయం స్పష్టం చేసింది. రాయలసీమకు తాగు, సాగు నీటిని తరలించడమే ఏపీ ప్రభుత్వలక్ష్యమని పేర్కొంది.మోదీకి వ్యతిరేకంగా రాగానే సీఎంవో కార్యాలయం ఎందుకు స్పందించినట్లు? కేంద్రంతో తాము సఖ్యత గాఉంటే ఎల్లో మీడియా దాన్ని చెడగొట్టే ప్రయత్నంచేస్తుందనా? లేక మోదీకి వ్యతరేకమయితే పాత కేసులను తిరగదోడతారనా? అన్న చర్చ జరుగుతోంది. ఇదేదో సమావేశం అయిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియాకు వివరించి ఉంటే ఇటు మీడియా ఊహాజనిత కథనాలు రాసేది కాదు. అటు రెండు రాష్ట్రాల ప్రజలకు క్లారిటీ వచ్చేది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… మోదీపై అసంతృప్తిని ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యక్తం చేయలేదని జగన్ కార్యాలయం స్పష్టం చేస్తే, కేసీఆర్ కార్యాలయం మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.