ఏలూరు, సెప్టెంబర్ 6 (way2newstv.com)
అనుభవం ఉన్న నాయకుడిగా తనను తాను పరిచయం చేసుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారంలో ఉండగా చేసిన కొన్ని పనులు ఇప్పుడు ఆయనను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆయన అనుసరిం చిన విధానాలే ఆయనను ఇప్పుడు తిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుల విషయాన్ని ఆయన లైట్ తీసుకున్నారు. సాధారణంగా తమ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వం ఏర్పడితే.. కమ్మ వర్గానికి ప్రాధాన్యం ఉంటుందని వారంతా ఆశించారు. ఈ క్రమంలోనే కమ్మ వర్గానికి చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు చుట్టూ చేరారు.
టీడీపీకి వరుస దెబ్బలు
ఈ క్రమంలోనే ఆయన కొందరికి మంత్రివర్గంలో చంద్రబాబు చోటు కల్పించారు. దీంతో వారు అధికారంలో ఉంటూ.. తమ పనులు చక్కబెట్టుకున్నారు. ఇక, మిగిలిన వారిలో చాలా మంది మంత్రి పదవులు ఆశించానా.. చంద్రబాబు వారిని లైట్ తీసుకున్నారు. దీంతో వారు చంద్రబాబుపై ఆగ్రహం పెంచుకున్నారు. ఇలాంటి వారిలో పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వంటివారు ఉన్నారు. ఇక, మంత్రి పదవులు దక్కనివారు.. ఒకింత ఫైర్ బ్రాండ్లుగా ఉన్నవారు.. అధికారం అడ్డు పెట్టుకుని దుమ్ము రేపారు. వీరిలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు.ఇప్పుడు వీరి పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైంది. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. లైమ్ స్టోన్ గనుల దోపిడీలో యరపతినేని మునిగిపోయారు. ప్రస్తుతం యరపతినేనిపై సీబీఐ విచారణ కూడా జరగనుంది. ఇక, ఎవరిపైనైనా తనదే పైచేయిగా ఉండాలనే లక్ష్యంతో చింతమనేని నోటి దురుసు పెంచుకున్నారు. ఫలితంగా ఇప్పుడు ఇద్దరూ కేసుల ఊబిలో చిక్కుకున్నారు. ఇదిలావుంటే, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిజానికి వీరిని అధికారంలో ఉన్నసమయంలోనే చంద్రబాబు లైన్లో పెట్టి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.కానీ, అప్పట్లో వారికి తాను పదవులు ఎలాగూ ఇవ్వలేదు కనుక.. ఏం చేసినా.. ఏమవుతుందిలే.. మళ్లీ మనదే కదా.. అధికారం అనుకున్న చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు చిత్తుగా ఓడిపోయారు. మంత్రి పదవి ఇవ్వలేదని యరపతినేనిని చూసీ చూడనట్టు వదిలేయడంతో ఆయన తీవ్రమైన అవినీతి, ఆరోపణల్లో చిక్కుకున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో చింతమనేని పార్టీ పెడతానని బెదిరించడంతో బాబు బెదిరిపోయి ఆయన విషయంలో సైలెంట్ అవ్వడంతో చింతమనేని అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది.అటు కోడెల సైతం మంత్రి పదవి ఆశించినా స్పీకర్‌తో సరిపెట్టుకున్నారు. ఆయనకు ఏకంగా సత్తెనపల్లితో పాటు నరసరావుపేట కూడా బంగారంలా దొరికింది. బాబు ఐదేళ్ల క్రిందటే నరసారావుపేటకు మరో ఇన్‌చార్జ్‌ను నియమించి ఉంటే వాళ్ల దోపిడీ ఇంత దారుణంగా ఉండేదే కాదు. వీరితో పాటు పార్టీలో కొందరు చీడపురుగులుగా మారితే.. మరికొందరు మౌనం వహించారు. వెరసి నష్టపోతోంది చంద్రబాబే.
Tags:
political news