విజయవాడ, సెప్టెంబర్ 6, (way2newstv.com)
చాన్నాళ్లుగా కొండెక్కి కూర్చున్న సిమెంట్, ఐరన్ ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. మధ్యతరగతి, నిర్మాణ రంగాల వారికి ఊరటనిచ్చేలా అందుబాటులోకి వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇవి పెరగడమే తప్పా తగ్గడం లేదు. దీంతో సొంతంగా ఇళ్లు, భవనాల నిర్మాణం చేపట్టే వారితో పాటు నిర్మాణరంగంలో ఉన్న వారికి వీటి ధరలు పెనుభారంగా పరిణమించాయి. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతూ వచ్చింది. విజయవాడలో దాదాపు ఐదారు నెలల నుంచి 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.350–380ల మధ్య ఉంది. ఇప్పుడది రూ.80 నుంచి 100 వరకు తగ్గింది. బెజవాడ మార్కెట్లో 20కి పైగా కంపెనీలు సిమెంట్ విక్రయాలు జరుపుతున్నాయి. ఒక్కో కంపెనీ మధ్య సిమెంట్ గ్రేడ్‌ను బట్టి బస్తాకు 20–80 వరకు వ్యత్యాసం ఉంటుంది. వారం పది రోజుల నుంచి సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి.
దిగొస్తున్న సిమెంట్, ఇటుకల ధరలు
నెల రోజుల క్రితం వరకు కూడా 50 కిలోల బస్తా ధర రూ.350– 370 మధ్య ఉన్న సిమెంట్ ఇప్పుడు రూ.260–280కు దిగివచ్చింది. అదే సమయంలో ఇనుము «(ఐరన్) ధర కూడా బాగా తగ్గుముఖం పట్టింది. జాతీయ స్థాయిలో ఆర్థికమాంద్యం ప్రభావంతో టన్ను ఇనుము ధర రూ.10 నుంచి 12 వేల వరకు తగ్గింది. రెండు మూడు నెలల క్రితం ఐరన్ టన్ను రూ.50–52 వేల వరకు ఉండేది. కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వచ్చి ఇప్పుడు సగటున రూ.38–40 వేల మధ్య లభ్యమవుతోంది. సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా దిగివస్తున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉన్న వర్తకులు సాధ్యమైనంత మేర నిల్వ ఉంచుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత నిర్మాణరంగం మరింత ఊపందుకుంటే లాభపడవచ్చని వీరు యోచిస్తున్నారు. రాష్ట్రంలో నెలకు సగటున ఐరన్ 10 నుంచి 15 మిలియన్ టన్నులు, సిమెంట్ 15–20 మిలియన్ టన్నుల వినియోగం జరుగుతోంది. మరోవైపు సిమెంట్, ఇనుము ధరలతో పాటు ఇటుక ధరలు కూడా దిగివస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు వెయ్యి ఇటుకలు రూ.7 వేలకు విక్రయించే వారు. ఇప్పుడు రూ.5000–5,500కు లభ్యమవుతున్నాయి. ఈ లెక్కన వెయ్యి ఇటుకల వద్ద రూ.1,500–2000 వరకు తగ్గుముఖం పట్టినట్టయింది. త్వరలో ఇసుక కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇలా నిర్మాణ రంగానికి అవసరమైన వీటి ధరలు ఒక్కొక్కటిగా తగ్గుతుండడం నిర్మాణ రంగం వారికి ఊరటనిస్తోంది. .
Tags:
Andrapradeshnews